Bramayugam Review: హారర్ థ్రిల్లర్‌ భ్రమయుగం..మ‌మ్ముట్టి న‌ట విశ్వ‌రూపం చూస్తారు

Bramayugam Review: హారర్ థ్రిల్లర్‌ భ్రమయుగం..మ‌మ్ముట్టి న‌ట విశ్వ‌రూపం చూస్తారు

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) హీరోగా ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన  మూవీ భ్రమయుగం (Bramayugam). ఈ పీరియాడిక్‌ హారర్ థ్రిల్లర్‌ ఫిబ్రవరి 15న మలయాళంలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఇవాళ (ఫిబ్రవరి 23న) భ్రమయుగం థియేటర్స్ లో రిలీజయ్యింది. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో తెరకెక్కిన భ్రమయుగం తెలుగు ఆడియన్స్ ను ఎలా మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే:

కేరళ ప్రాంతాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకునే రోజుల నాటి కథ ఇది. తేవన్ (అర్జున్ అశోక‌న్‌) ఓ గాయ‌కుడు. పోర్చుగీసు సేన‌లు త‌క్కువ కులం వారిని బానిస‌లుగా చేసి అమ్మేస్తుండ‌టంతో వారికి దొర‌క్కుండా త‌న స్నేహితుడితో క‌లిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. ఆ భయంకరమైన అడ‌విలో దుష్ట‌శ‌క్తి బారిన ప‌డి అత‌డి స్నేహితుడు కోరా తేవాన్ క‌ళ్ల ముందే చనిపోతాడు. తేవన్ తన గ్రామానికి వెళ్ళడానికి దారి తెలియక..దిక్కుతోచని బాటసారిలా అడవిలో అటూ ఇటూ తిరుగుతూ..చివరికి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో వింతగా..భీకరమైన రూపంలో ఇద్దరు మనుషులు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్‌ భరతన్‌), మరొకరు యాజమాని కుడుమన్‌ పొట్టి (మమ్ముట్టి).

తేవన్‌కు కొడుమోన్ పొట్టి త‌న ఇంటిలో ఉండటానికి చోటు ఇస్తాడు. ఇక తేవన్ ఆ పాత భవంతిలోకి చేరిన తర్వాత..ఆ ఇంటి వెన‌కాల చాలా మంది స‌మాధులు ఉండ‌టం గ‌మ‌నిస్తాడు. తేవన్ తక్కువ కులం వాడు అని తెలిసిన కూడా..ఇంటికి వచ్చిన అతిథి అని, తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు కుడుమన్‌ పొట్టి. అయితే..ఇంట్లో క్షుద్ర‌పూజ‌ల ఆన‌వాళ్లు తేవన్ కు క‌నిపిస్తాయి.దీంతో ఉన్నట్టుండి అక్కడ జరిగే కొన్ని పరిణామాలు చాలా భయాన్ని పుట్టిస్తాయి. ఇక తేవన్ ఆ ఇంట్లో నుంచి పారిపోయేందుకు చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ తేవన్ చేసే ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి.

ఇంతకు అడవిలో ఉంటున్న కుడిమన్‌ పొట్టి ఎవరు? ఆ పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు? అతని గురించి అన్నీ తెలిసిన వంటమనిషి ఆ ఇంట్లో అత‌డితో పాటే ఎందుకున్నాడు? తేవన్ను ఎందుకు బంధీగా మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి తేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో భ్రమయుగం సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే:

72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. మెగాస్టార్‌ అనే స్టార్ ఇమేజ్‌ని పక్కకి పెట్టి కేవలం కంటెంట్‌ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. భ్రమయుగం సినిమా కూడా మమ్ముట్టి కెరీర్లో మరో ప్రయోగాత్మక చిత్రమని చెప్పుకోవొచ్చు. 

ద‌క్షిణాది భాష‌ల్లో మాయ‌లు, మంత్రాలు, క్షుద్ర‌పూజ‌ల కాన్సెప్ట్‌ల‌తో ఇప్పటికీ ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ వాటన్నిటికీ భిన్నంగా భ్ర‌మ‌యుగం సినిమా తెరకెక్కించాడు డైరెక్టర్. ఒక్క చిన్న పాయింట్‌తో సినిమాని రెండున్నర గంటల పాటు స్టోరిని నడిపించడం మాములు విషయం కాదు. ఈ విషయంలో డైరెక్టర్ రాహుల్ సదాశివన్ వందశాతం సక్సెస్‌ అయ్యాడు. 

పాడుబడ్డ భవంతిలో ఓ మాంత్రికుడు..అతని చేతిలో బంధి అయిన ఓ ఇద్దరి వ్యక్తుల కథే భ్ర‌మ‌యుగం. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్‌ చిన్నదే అనిపించిన..దాని చుట్టు అల్లుకున్న సీన్స్..మ‌మ్ముట్టి ఎంట్రీ సీన్..పురాత‌న బంగ్లాలో వ‌చ్చే సౌండ్స్..తేవన్‌ను బిల్డింగ్‌లో ట్రాప్ చేయ‌డానికి పాచిక‌ల గేమ్..ఇలా ప్రతీదీ డైరెక్టర్ మలిచిన తీరు అద్బుతంగా ఉంది.

సినిమా మొదలయ్యాక కాస్తా స్లోగా వెళ్లిన ఫీలింగ్ ఇచ్చిన..అది కేవలం పాత్రల పరిచయం చేసే వరకు మాత్రమే స్లో అనే ఫిలింగ్ ఇస్తుంది. ఇక పాడుబడ్డ భవన్‌లోకి తేవన్‌ ఇంట్రీ ఇచ్చాక అసలు కథ షురూ అవుతుంది. ఆ భవంతిలో చోటు చేసుకునే సంఘటనలు ప్రేక్షకులని ఉత్కంఠకు గురి చేస్తాయి.

ఫస్టాఫ్‌ పాత్రల పరిచయం వల్ల కొంచెం నెమ్మదిగా సాగినా..అక్కడ వచ్చే సీన్స్‌ మాత్రం హారర్ థ్రిల్లింగ్‌ను ఇస్తాయి. ఇంటర్వెల్ టైములో మ‌మ్ముట్టి క్యారెక్ట‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చే ట్విస్ట్ హైలైట్ గా ఉంటుంది. సెకండాఫ్ లో కథనం ట్విస్టింగ్ ఎలెమెంట్స్ తో ఉత్కంఠభరితంగా సాగుతుంది. కుడుమోన్ పొట్టి, వంట‌వాడి మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఆసక్తిని పెంచుతుంది.

కొడుమోన్ పొట్టి కుటుంబం తాలూకు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ యావ‌రేజ్‌గా అనిపిస్తుంది.అఖండ దీపం నేప‌థ్యంలో క్లైమాక్స్‌ను డైరెక్టర్ చాలా సెన్సిటివ్ గా..డిఫరెంట్ లైక్ అదర్ ఫిలిమ్స్ అనేలా తెరకెక్కించాడు. భ్రమయుగం ఓ ఢిపరెంట్‌ థ్రిల్లర్‌ మూవీ. సినిమా మొత్తం కేవలం మూడు పాత్రల చుట్టే తిప్పుతూ ఆడియన్స్‌ని సీట్ల నుంచి కదలకుండా చేశాడు డైరెక్టర్ సదాశివన్.అంతేకాదు సినిమా మొత్తం బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తెరకెక్కించి మెప్పించాడు.

ఎవరెలా చేశారంటే:

ఈ సినిమాకు ప్రధాన బలం మమ్ముట్టి నటన అని చెప్పొచ్చు.కొడుమోన్ పొట్టి పాత్ర‌లో మ‌మ్ముట్టి త‌న న‌ట విశ్వ‌రూపంతో అద‌ర‌గొట్టాడు. వెండితెరపై కొత్త మమ్ముట్టిని చూస్తారు.అత‌డి లుక్‌, బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్స్ అన్ని అదిరిపోయాయి. సినిమా మొత్తంలో ఒకే డ్రెస్‌లో కనిపించి తనదైన నటనతో మెప్పించాడు. క్లైమాక్స్‌లో మమ్ముట్టి నటన అందరిని కట్టిపడేస్తుంది. తేవన్ పాత్రకు అర్జున్‌ అశోకన్‌ తనదైన నటనతో పూర్తి న్యాయం చేశాడు. వంట మనిషిగా సిద్ధార్థ్‌ భరత్‌ ఆకట్టుకున్నాడు. 

టెక్నీషియన్స్:

‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్  భ్ర‌మ‌యుగం సినిమాతో  డైరెక్టర్గా మరో మెట్టు ఎక్కాడు. క్రిస్టో జేవియర్ బీజీఎం సినిమా స్థాయిని పెంచేసింది. తనదైన బీజీఎంతో సౌండ్ తో సినిమా స్థాయిని మరో లెవల్ కి తీసుకెళ్లాడు. షఫీక్‌ మహమ్మాద్‌ అలీ సినిమాటోగ్రఫీ క్రియేటివిటీని చూపించాడు. సినిమా మొత్తం బ్లాక్‌ అండ్‌ వైట్‌ చూపించి..తెరపై ప్రతి సీన్‌ చాలా అందంగా కనిపించేలా చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు చాలా రిచ్ గా ఉన్నాయి. .