కరీంనగర్ కు చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి హైదరాబాద్ లో ఆత్మ‌హ‌త్య‌

కరీంనగర్ కు చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి హైదరాబాద్ లో ఆత్మ‌హ‌త్య‌

రంగారెడ్డి: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారక లాడ్జ్ లో ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. కరీంనగర్ కు చెందిన నాగ మల్ల వెంకట నర్సయ్య అనే వ్యక్తి లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్ర‌వారం రాత్రి కరీంనగర్ నుంచి వచ్చిన న‌ర్స‌య్య ద్వార‌క లాడ్జీలో దిగాడు. లాడ్జి కి సంబంధించిన వ్యక్తులు ఈ ఉద‌యం డోర్ కొట్టగా తీయకపోవడంతో అనుమానం వచ్చి నాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు

దీంతో సంఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న నాచారం పోలీసులు.. ఆ గ‌దిలో ఓ సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన నర్సయ్య అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ ద్వారా తెలిసింది. మృతిదేహాన్ని పోస్టు మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

గతంలో మాజీ ఎఎస్సై మోహన్ రెడ్డి మోసం చేసిన భాదితుల్లో ఒక‌రు వెంకట నర్సయ్య. వెంకట నర్సయ్య తన కోటి రూపాయల విలువైన ఇల్లు ను మోహన్ రెడ్డి భార్య బొబ్బల లత పేరు మీద‌ అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నాడని అప్పట్లో వెంక‌ట న‌ర్స‌య్య పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై గతంలో ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది.