ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన వ్యక్తి

ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన వ్యక్తి

ఏలూరు: ఏం కష్టమొచ్చిందో గాని.. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలసి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పదేళ్లలోపు వయసువారేనని తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని వేగేశ్వరపురంలో ఆదివారం జరిగిన ఘటన స్థానికంగా విషాదం సృష్టించింది. 
ఆదివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలసి బైకుపై గోదావరి ఒడ్డుకు వచ్చాడు. వెంట తెచ్చుకున్న అల్పాహారాన్ని ఇద్దరు పిల్లలతో కలసి తిని కొద్దిసేపు అక్కడే గడిపారు. ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా వచ్చి గడుపుతున్నట్లు కనిపించాడు. అయితే ఎవరూ ఊహించనిరీతిలో ఇద్దరు పిల్లతో కలసి ఒక్కసారిగా గోదావరిలోకి దూకేశాడు. 
నదిలో పెద్ద శబ్దం కావడంతో స్థానికులు చూడగా.. ఇద్దరు పిల్లలతో కలసి తండ్రి నదిలోకి దూకినట్లు  కనిపించింది. స్థానికులు హుటాహుటిన వచ్చి చూసినా.. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వారు నదిలోకి దూకే సాహసం చేయలేక పోలీసులు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే తాళ్లపూడి సబ్ ఇన్స్ పెక్టర్ సతీష్ ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. అయితే వారు వరద ప్రవాహంలో చాలా దూరం కొట్టుకుపోయి ఉంటారనే అంచనాతో మరికొందరిని రంగంలోకి దింపారు. ఒడ్డున నిలిపిన బైకు నెంబర్ ఆధారంగా నదిలోకి దూకిన వ్యక్తి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బైకు భీమవరం పట్టణానికి చెందినదిగా తేలడంతో ఆ వ్యక్తి ఎవరు.. పిల్లలెవరు అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.