పెద్దాయన గ్రేట్ : ఈ అడవుల్లో పులులతో ఫైట్ చేస్తడు

పెద్దాయన గ్రేట్ : ఈ అడవుల్లో పులులతో ఫైట్ చేస్తడు

పులి పేరు చెప్తేనే ఒంట్లో వణుకు మొదలయింది చానామందికి. అలాంటిది పులి ఎదురంగ వస్తే.. కళ్ల ముందటకొచ్చి పంజా విసిరితే.. అమ్మో! తలుచుకుంటేనే గుండె ఆగినంత పనైతది ఎవరికైనా. కానీ, ఈ అరవై ఆరేళ్ల ఎల్ముల శంకర్ మాత్రం పులికి ఇసుమంతైనా బెదరడు. తన గొర్రెల మంద జోలికొస్తే పులినే పరిగెత్తిస్తాడు. అలా ఇప్పటికే మూడు సార్లు పులితో పోరాడి గెలిచిండు మంచిర్యాల జిల్లాకి చెందిన శంకర్.

శంకర్ ది మంచిర్యాల జిల్లా వేమనపల్లి  మండలంలోని ఒడ్డుగూడెం. వాళ్ల తాతముత్తాతలు గొర్రెలు కాసేటోళ్లు. ఇప్పుడు శంకర్ కూడా అదే పని చేస్తుండు. ఊరి చివర అడవిలో గొర్రెలు, మేకలు, ఆవులు కాసుకుంట... కుటుంబాన్ని సాదుకుంటుండు. రోజూలానే ఒకరోజు గొర్రెల మందని తోలుకుని అడవికి పోయిండు శంకర్. తోటి కాపర్లతో కలిసి గొర్రెలు కాస్తుంటే.. ఎలుగుబంటి కదలికలు కనపడ్డాయ్. క్షణాల్లోనే ఎలుగుబంటి ఎదురంగ వచ్చి నిలబడ్డది. అయినా భయపడలేదు. దాన్ని పరిగెత్తించి ప్రాణాలు కాపాడుకున్నడు. 

ఆ తర్వాత కొద్దిరోజులకే పెద్దపులి శంకర్ మేకలపై దాడి చేసింది. అది చూసి ప్రాణ భయంతో మిగతా కాపర్లంతా పరుగులు తీసిన్రు. కానీ, శంకర్ మాత్రం ధైర్యంగా పెద్దపులిని ఎదిరించిండు. దాని నోట్లోంచి తన మేకని గుంజి తీసుకొచ్చిండు. దాన్నుంచి తేరుకునేలోపే మరో పులి తన ఆవు మీద దాడి చేసింది. దాన్ని కాపాడటానికి పోతే శంకర్పై విరుచుకుపడింది ఆ పులి. అయినా భయపడకుండా దాన్ని తరిమి కొట్టిండు.

పులిని పరిగెత్తించిండు

కిందట నెలల్లో అడవికి వెళ్తే ఒక్కసారిగా మేకలన్నీ బెదిరినయ్. ఏదో అడవి జంతువు నుంచి ప్రమాదం కాచుకు కూర్చుందని అర్థమైంది. అతనికి. చుట్టూ చూస్తుండంగనే పొదలో నుంచి పెద్దపులి బయటికొచ్చింది. తన ప్రాణాల్ని పణంగా పెట్టి గొర్రెల మందకి అడ్డుగా నిల్చున్నడు శంకర్. అది ఎగిరి శంకర్ మీదకి దూకింది. అయినా భయపడకుండా తన గొడ్డలి కామతో తలమీద రెండు, మూడు దెబ్బలు కొట్టిండు. 

పెద్దపులి అల్లంత దూరంలో పడింది. మళ్లీ అతని మీదకి దూకింది. పులి దాడిలో శంకర్ చెయ్యి బొక్క ఇరిగింది. అయినా బెదరలేదు అతను. దాని మీసాలు, చెవులు పట్టుకుని గొడ్డలి కామతో మళ్లీ కొట్టిండు. ఆ దెబ్బలకి పెద్దపులి వచ్చిన దారినే పారిపోయింది. దాంతో ఈ పెద్దాయన ధైర్యం చూసి అంతా మెచ్చుకుంటున్నారు.
-దాసరి పృధ్వీ, బెల్లంపల్లి రూరల్, వెలుగు

చంపుద్దన్న భయం లేదు

పుట్టిన సంది గొర్రెలు, మేకలే మాకు తిండి పెడుతున్నయ్. వీటితోని వచ్చిన పైసలతోనే మా పిల్లల్ని సాకి, పెండ్లి చేసి ఈ ముసలితనంలోనూ అవే మాకు అండగా ఉంటున్నయి. అసుంటి వాటికి ఆపతి వస్తే ప్రాణం పోయినట్టు అనిపిస్తది. అందుకే వాటి ప్రాణాలకి నా ప్రాణం అడ్డుపెడతా. పెద్దపులితోనూ పోరాడతా. ఈరోజుకి మేకలకు కడుపునిండ మేపడం తప్ప ఏదైనా జంతువు చంపుద్దన్న భయం లేదు నాకు. 

-ఎల్ముల శంకర్