ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు ప్రియురాలి తల్లిదండ్రులను నరికి చంపిన ప్రేమోన్మాదికి ఉరిశిక్ష పడింది. 2026 మే 20వ తేదీన హంతకునికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది వరంగల్ జిల్లా కోర్టు. ఈ కేసును విచారించిన వరంగల్ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి.. విచారణ అనంతరం హంతకునికి ఉరిశిక్ష ఖరారు చేశారు.
2024 జులైలో తమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని ప్రియురాలి తల్లిదండ్రులను ప్రేమోన్మాది నాగరాజు నరికి చంపిన విషయం తెలిసిందే. చెన్నారావుపేట మండలం 16 చింతలతండాలో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. జులై 11న ప్రియురాలు తల్లిదండ్రులు సుగుణ-శ్రీను దంపతులను నరికి చంపడమే కాకుండా.. ప్రియురాలు, ఆమె సోదరుడి పై తీవ్రంగా దాడి చేశాడు ఉన్మాది నాగరాజు.
►ALSO READ | నల్లగొండ జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి తల్లి, కూతురిని నరికి చంపిన దుండగులు
చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాకు చెందిన బానోతు శ్రీనివాస్(45), బానోతు సుగుణ (40) దంపతులు పదహారు చింతల తండాలో నివాసముండేవారు. వారి కుమార్తె ను గుండెంగ గ్రామానికి చెందిన బన్నీ అలియాస్ నాగరాజు అనే యువకుడు 2023 నవంబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆ యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి యువతి ఇంటి వద్దే ఉంటూ హనుమకొండలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ ఉండేది.
తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే సమాచారంతో బన్నీ ఉన్మాదిగా మారాడు. తెల్లవారుజామున ఇంటి ముందు నిద్రిస్తున్న శ్రీనివాస్, సుగుణ దంపతులపై దాడికి పాల్పడ్డాడు. సుగుణ అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. ఈ ఘటనలో కూతురు, ఆమె సోదరుడు మదన్‌లాల్ కూడా గాయపడ్డారు.
