చేయని తప్పుకు 20 ఏండ్ల జైలు శిక్ష

చేయని తప్పుకు 20 ఏండ్ల జైలు శిక్ష
  • నలుగురు పిల్లల మృతి కేసులో ఆస్ట్రేలియా మహిళకు జైలు
  • 20 ఏండ్ల తర్వాత నిర్దోషిగా జైలు నుంచి విడుదల

బ్రిస్బేన్‌‌‌‌: కన్నబిడ్డల విషయంలో చేయని తప్పుకు 20 ఏండ్ల జైలు శిక్ష అనుభవించింది ఓ తల్లి. తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డల విషయంలో ఎందుకు తప్పు చేస్తానంటూ ఎంత మొర పెట్టుకున్నా ఎవ్వరూ ఆమె మాట వినలేదు. హడావుడిగా విచారణ జరిపి, ఆమెను దోషిగా నిర్ధారించి జైలుకు పంపారు. వరస్ట్‌‌‌‌ సీరియల్‌‌‌‌ కిల్లర్‌‌‌‌‌‌‌‌ అనే నిందను కూడా ఆమెపై మోపారు. ఇన్నేండ్ల తర్వాత ఆమె నిర్దోషి అని తీర్పు ఇస్తూ కేసును కోర్టు కొట్టేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. కాథ్లీన్ ఫాల్బిగ్‌‌‌‌కు నలుగురు పిల్లలు. 1989లో ఒక బిడ్డ, 1991లో మరో బిడ్డ, 1993లో ఇంకో బిడ్డ పుట్టిపుట్టగానే చనిపోయారు. దీంతో ఆ మరణాలు సడెన్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫాంట్‌‌‌‌ డెత్‌‌‌‌ సిండ్రోమ్‌‌‌‌ (ఎస్‌‌‌‌ఐడీఎస్‌‌‌‌) అని డాక్టర్లు పేర్కొన్నారు.

కానీ, 1999లో మరో బిడ్డకు కాథ్లీన్‌‌‌‌ జన్మనివ్వగా.. 18 నెలల తర్వాత ఆ చిన్నారి కూడా చనిపోయింది. వరుసగా నలుగురు చిన్నారులు చనిపోవడంతో ఆమెపై పోలీసులు కేసు పెట్టారు. ఫోరెన్సిక్‌‌‌‌ అధికారులు కూడా ఆ మరణాలకు కారణాలను తెలుసుకోలేకపోయారు. అయినా ఆ పిల్లలను తల్లే హత్య చేసిందని పోలీసులు కేసు ఫైల్‌‌‌‌ చేసి, కోర్టులో నిలబెట్టారు. డైరీలో ఆమె రాసుకున్న కొన్ని లైన్‌‌‌‌లు నేరాన్ని అంగీకరించే లా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో 2003లో కోర్టు ఆమెను దోషిగా తేల్చడంతో, 20 ఏండ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. ఇన్నేండ్ల తర్వాత ఇప్పుడు పిల్లలందరూ సహజంగానే చనిపోయారని తేలడంతో ఆమె క్షమాభిక్ష పొందింది. మెడికల్‌‌‌‌ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో నిర్దోషిగా బయటపడ్డానని కాథ్లీన్‌‌‌‌ తెలిపారు. అరుదైన జన్యు లోపాలు, పుట్టుకతో వచ్చే సమస్యల వల్ల చిన్నారులు చనిపోయారని చెప్పారు.  తనకు జరిగిన నష్టానికి పరిహారం కోరతానన్నారు.