ఢాకా: భార్య వడ్డించిన ఆహారంలో వెంట్రుకలు వచ్చాయని ఆమెపై దారుణంగా ప్రవర్తించాడో వ్యక్తి. కోపంతో ఊగిపోయి.. బూతులు తిడుతూ బలవంతంగా ఆమెకి గుండు గీశాడు. బంగ్లాదేశ్ లోని జయ్ పుర్హత్ గ్రామంలో మంగళవారం జరిగిందీ ఘటన.
గ్రామానికి చెందిన బబ్లూ మండల్(35)కి భోజన సమయంలో అతని భార్య ఆహారాన్ని వడ్డించింది. అన్నంలో వెంట్రుకలు వచ్చాయని భార్యతో గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా ఓ బ్లేడు తీసుకొని బలవంతంగా ఆమెకు గుండు గీశాడు.
అతడు చేస్తున్న పనికి ఆమె పెట్టిన కేకలు విన్న స్థానికులు వచ్చి చూసి షాక్ అయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీనిపై పోలీస్ చీఫ్ షాహ్రీర్ ఖాన్ మాట్లాడుతూ.. అతను ఉద్దేశ్య పూర్వకంగానే ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతను చేసిన పనికి గరిష్టంగా 14 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముందన్నారు.

