మహబూబాబాద్‌‌లో యువకుడు హత్య

మహబూబాబాద్‌‌లో యువకుడు హత్య

మహబూబాబాద్‌‌అర్బన్‌‌, వెలుగు : రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌‌ జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని లెనిన్‌‌నగర్‌‌కు చెందిన తూళ్ల ప్రభాకర్​(35) తల్లిదండ్రులు, సోదరుడు చనిపోవడంతో ఒంటరిగా ఉంటూ చిత్తుకాగితాలు ఏరుకొని జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి రోడ్డు పక్కన పడుకున్న ప్రభాకర్‌‌పై గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో దాడి చేసి చంపేశారు.

సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌‌టీం, డాగ్‌‌స్క్వాడ్‌‌ ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. ప్రభాకర్‌‌ బంధువులు గట్టయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, శ్రీనివాస్‌‌ అనే వ్యక్తితో ప్రభాకర్‌‌ కలిసి తిరిగేవాడని స్థానికులు చెప్పడంతో అతడి కోసం గాలిస్తున్నామన్నారు.