దారుణం: ఇంటర్మీడియట్ అమ్మాయి గొంతు కోసి చంపిన ఉన్మాది

దారుణం: ఇంటర్మీడియట్ అమ్మాయి గొంతు కోసి చంపిన ఉన్మాది
  • ఇంట్లో ఎవరూ లేని టైమ్​లో చొరబడిన దుండగులు
  • వంటింట్లో ఉండే కత్తితో అమ్మాయి హత్య!
  • గతంలో ఇంట్లో అద్దెకు ఉన్న యువకుడిపై అనుమానం
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ లో ఘోరం జరిగింది. ఇంటర్ స్టూడెంట్ దారుణ హత్యకు గురైంది. అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆమెను గొంతు కోసి చంపారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘటన సాయంత్రం వరకు వెలుగుచూడలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇంట్లో అద్దెకు ఉన్న యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్ వెంకటేశ్వర టెంపుల్ ఏరియాలో ముత్త కొమురయ్య, ఓదెమ్మ ఉంటున్నారు. వీరి కూతురు రాధిక స్థానిక సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. కాలేజీలో సిలబస్ అయిపోవడంతో కొద్ది రోజులుగా ఇంటి వద్దే ఉండి చదువుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం రాధిక తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటరిగా ఉన్న సమయంలో హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె నిద్రించే గదిలోనే గొంతు కోసి చంపారు. రాధిక హత్యకు గురైందని స్థానికులు ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. బిడ్డ నిర్జీవంగా పడి ఉండటం చూసి రోదించారు. గతంలో తమ ఇంటిపై పోర్షన్ లో పోషాలు, లచ్చవ్వ అనే వ్యక్తులు అద్దెకు ఉండేవారని.. తరుచూ పోషాలు తాగి వచ్చి గొడవ చేస్తుండటంతో ఇల్లు ఖాళీ చేయించామని బాధిత తల్లిదండ్రులు చెప్పారు. వారికి ఓ కూతురు, కొడుకు ఉన్నారని, ఆ కొడుకుపైనే అనుమానం ఉందని స్థానికులు చెప్పారు. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు.

ఫింగర్ ప్రింట్స్ సేకరించాం: పోలీసులు

కరీంనగర్ డీసీసీ చంద్రమోహన్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. కాలనీలోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే హంతకుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కిచెన్​లో ఉండే కత్తితోనే యువతిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఫింగర్ ప్రింట్స్ గుర్తించామని, అంతకు మించి ఏ క్లూ దొరకలేదని తెలిపారు. అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని చెప్పారు. పూర్తి వివరాలు పోస్టు మార్టంలో తేలుతాయని అన్నారు.

మంత్రి గంగుల పరామర్శ

రాధిక కుటుంబాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్​లో స్టూడెంట్ హత్య ఊహించని దారుణమని మంత్రి అన్నారు. ఇలాంటి సంఘటనలకు తావులేదని, ఎంతటి వారైనా ఊరుకోబోమని చెప్పారు. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానం కలుగుతోందన్నారు.

అఘాయిత్యాలు దారుణం: బండి సంజయ్

న్యూఢిల్లీ, వెలుగు: ఇంటర్ స్టూడెంట్ రాధిక హత్యపై ఎంపీ బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. పోలీసులు కేసును వేగంగా దర్యాప్తు చేయాలని కోరారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు దారుణమని అన్నారు. ఎన్నో ఆశలతో కష్టపడి కూతురిని చదివిస్తున్న తల్లిదండ్రుల కడుపుకోత మిగిలిందని, తనను తీవ్రంగా కలచి వేస్తోందని అన్నారు.