
రాజస్థాన్‌లోని ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తాను పెళ్లి చేసుకునేందుకు ఓ వధువును చూడాలని కోరుతూ ప్రభుత్వ సహాయ శిబిరంలోకి వెళ్లి అధికారులకు దరఖాస్తు సమర్పించాడు ఓ వ్యక్తి. పెళ్లి కూతురు కోసం వ్యక్తి పెట్టుకున్న దరఖాస్తు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పెళ్లి కూతురు కోసం దరఖాస్తు..
రాజస్థాన్ ప్రభుత్వం అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి 'ఉపశమన శిబిరాలను' ఏర్పాటు నిర్వహిస్తోంది. అయితే జూన్ 3న దౌసా జిల్లాలోని సికంద్రా ప్రాంతంలో గంగద్వాడి గ్రామంలోని అంగన్‌వాడి వద్ద ఓ సహాయ శిబిరాన్ని అధికారులు ఏర్పాటు చేశారు, ఇందులో ఒక వింత సంఘటన జరిగింది. 45 ఏళ్ల కైలాష్ మహావర్ అలియాస్ కల్లు మహావర్.. తనకు పెళ్లి చేసుకోవడానికి భార్య కావాలంటూ తహసీల్దార్‌కు మెమోరాండం ఇచ్చాడు.
భార్య ఎలా ఉండాలంటే..
45 ఏళ్ల కల్లు తహసీల్దార్‌కు అర్జీ ఇచ్చిన దరఖాస్తులో తన భార్య ఎలా ఉండాలో కూడా తెలియజేశాడు. తనకు కాబోయే భార్య సన్నగా ఉండాలని.. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలని కోరాడు. అంతేకాదు కాబోయే భార్యకు ఇంటి పనిలో నైపుణ్యం ఉండాలన్నాడు.
భార్య కోసం కమిటీ ఏర్పాటు..
కైలాష్ మహావర్ సమర్పించిన దరఖాస్తును పరిశీలించిన అతనికి న్యాయం చేయాలంటూ తహసీల్దార్ హరికిషన్ సైనీ గ్రామ కార్యదర్శి, పట్వారీకి సిఫార్స్ చేశారు. కైలాష్ మహావర్ బాధను అర్థం చేసుకున్న ఎమ్మార్వో అతనికి పెళ్లి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కైలాష్ మహావర్ సమస్య పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ స్థాయిలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని పట్వారీని ఆదేశించారు. భార్య కోసం కైలాష్ మహావర్ దరఖాస్తు సమర్పించాడని తెలిసిన వెంటనే ఆయన ఇంటికి జనం పోటెత్తారు.
కైలాష్ ఏం చేస్తాడంటే..
కైలాస్ ప్రస్తుతం తన తమ్ముడి దగ్గర ఉంటాడు. అతను గ్రామ పంచాయతీతో పాటు.. మార్కెట్‌లో లివింగ్ క్లీనింగ్ షాపుల్లో పనిచేస్తాడు. తనకు ఒక అక్క, ముగ్గురు సోదరులు ఉన్నారని..అయితే అక్కతో పాటు..ముగ్గురు సోదరుల వివాహం జరిగిందని కైలాష్ మహావర్ తెలిపాడు. తనకు పెళ్లి అవడం లేదన్న ఉద్దేశంతోనే అధికారులకు దరఖాస్తు సమర్పించానని చెప్పుకొచ్చాడు.