
మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటిస్తున్న చిత్రం 'మన శంకర వరప్రసాద్‌గారు' . ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన పోస్టర్లు, ప్రోమోలు ఈ సినిమాపై అంచాలు మరింత పెంచాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత చేసిన చిత్రాల్లో, ఆయనకు ధీటైన విలన్ పాత్ర లేదనే చర్చ టాలీవుడ్ లో నడుస్తోంది. ఈ లోటును పూడ్చే ప్రయత్నంలో భాగంగా 'మన శంకర వరప్రసాద్‌గారు' లో విలన్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఊహించని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవి డ్రిల్ మాస్టర్‌గా కొత్త అవతారంలో కనిపించనున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్, ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతుండటంతో, విలన్ పాత్ర కూడా కాస్త హాస్యం, పవర్ కలగలిపి ఉండాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.
మలయాళ పవర్ స్టార్‌కి కమెడియన్ టచ్
ఈ బ్యాలెన్స్ కోసమే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 'దసరా' చిత్రంతో తెలుగులో పవర్ ఫుల్ విలన్‌గా అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 'దేవర', 'డాకు మహరాజ్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. షైన్ టామ్ చాకోలో కేవలం సీరియస్ విలనిజమే కాదు, అద్భుతమైన కామెడీ టైమింగ్ కూడా ఉంది. ఈ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకునే అనిల్ రావిపూడి, షైన్ పాత్రకు కామిక్ టచ్ ఇచ్చారని ఇండస్ట్రీ టాక్. ఇది మెగాస్టార్‌తో ఆయన తలపడే సన్నివేశాలకు మరింత వినోదాన్ని జోడించడం ఖాయంగా కనిపిస్తోంది.
►ALSO READ | ఇంట్రెస్టింగ్, సస్పెన్స్ తో ఈ వారం ఓటిటిలో రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవే..
షైన్ ఇప్పటికే షూటింగ్‌లో జాయిన్ అయ్యారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. గతంలో డ్రగ్స్ కేసులో ఆయన అరెస్ట్ అయినప్పటికీ, తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో, కామెడీ టచ్ ఉన్న పవర్ ఫుల్ విలన్‌గా షైన్ టామ్ చాకో లాంటి నటుడు చేరడం... ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాను మెగా అభిమానులకు, ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తుందని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
నయనతార, వెంకటేశ్‌ల స్పెషల్ అట్రాక్షన్
'మన శంకర వరప్రసాద్‌గారు' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇది ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.