ప్రైవేట్ కంపెనీల చేతిలో జైపూర్​ ఎస్టీపీపీ నిర్వహణ

ప్రైవేట్ కంపెనీల చేతిలో జైపూర్​ ఎస్టీపీపీ నిర్వహణ

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​లోని సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​ (ఎస్టీపీపీ)లో కరెంట్​ ఉత్పత్తిలో రికార్డులు సాధిస్తున్న సింగరేణి సంస్థ అందుకు చెమటోడుస్తున్న కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. ఎస్టీపీపీ నిర్వహణను ప్రైవేట్​ కంపెనీకి అప్పగించి అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఎంప్లాయీస్​ జీవితాలతో చెలగాటమాడుతోంది. ప్లాంట్​లో జరుగుతున్న ప్రమాదాల్లో వర్కర్లకు గాయాలైనా, చనిపోయినా లేబర్​ యూనియన్ల ఆధ్వర్యంలో మిగతా కార్మికులు రోడ్డెక్కితే తప్ప బాధితులకు కనీస న్యాయం దక్కని పరిస్థితి నెలకొన్నది. సింగరేణి తరపున పర్యవేక్షణ బాధ్యతలను రిటైర్డ్​ ఆఫీసర్లకు అప్పగించి పెత్తనమంతా వారికే కట్టబెట్టడంతో అసలు ప్లాంట్​లో ఏం జరుగుతుందో కూడా బయటకు తెలిసే అవకాశమే లేకుండా పోయింది. 

కాంట్రాక్టర్ల చేతిలో ఎస్టీపీపీ....  

ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థ జైపూర్​లో థర్మల్​ ప్లాంట్​ నిర్మాణం మొదలైంది. తెలంగాణలో టీఆర్​ఎస్​ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో కరెంట్​ ఉత్పత్తిని ప్రారంభించింది. ఎస్టీపీపీ నిర్మాణం నుంచి కరెంట్​ ఉత్పత్తి వరకు అన్ని పనులను ప్రైవేట్​ కంపెనీలకు అప్పగించిన సింగరేణి కేవలం పర్యవేక్షణకే పరిమితమైంది. గతంలో నాలుగేండ్లు జర్మనీ దేశానికి చెందిన స్టీగ్​ కంపెనీ ఎస్టీపీపీని నడిపించింది. రెండు సంవత్సరాల కిందట పవర్​మెక్​ అనే మరో కంపెనీ కాంట్రాక్ట్​ దక్కించుకుంది. సింగరేణి సంస్థ ప్లాంట్​ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకొని కాంట్రాక్టర్ల చేతిలో పెట్టడంతో వాళ్లు కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.  

సింగరేణి పర్యవేక్షణకే పరిమితం... 

ఎస్టీపీపీలో కరెంట్​ ఉత్పత్తి మొదలు కార్మికులకు జీతాల చెల్లింపు వరకు కాంట్రాక్ట్​ సంస్థలే చూసుకుంటున్నాయి. సింగరేణి యాజమాన్యం కేవలం పర్యవేక్షణకే పరిమితం కావడంతో కార్మికుల భద్రత, సంక్షేమం అటకెక్కింది. 1200 మెగావాట్ల ప్లాంట్​లో ప్రతి నెల మేనేజ్​మెంట్​ నిర్దేశించిన పీఎల్​ఎఫ్​ (పవర్​ లోడ్​ ఫ్యాక్టర్​) సాధిస్తే చాలు మిగతా విషయాలు అక్కర్లేదనే రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారు.  ఎస్టీపీపీలో సుమారు 1600 మంది కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఎంప్లాయీస్​ పనిచేస్తున్నారు. ఇందులో భూనిర్వాసితులు, లోకల్​ కార్మికులు 400 మంది వరకు ఉండగా, మిగతా 1200 మంది ఉత్తర భారత రాష్ర్టాలకు చెందినవారు. ఉన్నతాధికారులు కూడా అక్కడివాళ్లే కావడంతో లోకల్ ఎంప్లాయీస్​ను చిన్నచూపు చూస్తున్నారు. కార్మికులకు వేతనాలు చెల్లింపు, పని స్థలాల్లో భద్రత, సంక్షేమం విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నారు. 

తరచూ ప్రమాదాలు..

సింగరేణి సంస్థ ఎస్టీపీపీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. ప్రిన్సిపల్​ ఎంప్లాయర్​గా కార్మికుల బాగోగులు చూడాలన్న బాధ్యతను మర్చిపోయింది. దీంతో కార్మికులు కాంట్రాక్ట్​ కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. పని స్థలాల్లో కనీస రక్షణ చర్యలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గాయాలైనా, చనిపోయినా తోటి కార్మికులు రోడ్డెక్కితే తప్ప నష్టపరిహారం ఇవ్వడం లేదు. మూడ్రోజుల కిందట జరిగిన ప్రమాదంలో చంద్రమోహన్​ అనే మెకానిక్​ మృతి చెందడం తెలిసిందే. కార్మిక సంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్​గ్రేషియా, రెండు ఉద్యోగాలు ఇచ్చేందుకు పవర్​మెక్​ యాజమాన్యం ఒప్పుకుంది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికీ అవి బయటకు రాకుండా అధికారులు తొక్కిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.