
నస్పూర్, వెలుగు: హెచ్ ఐవీ, ఎయిడ్స్ వ్యాధి నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ, హెచ్ ఐవీ నియంత్రణ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో చేపట్టిన బైక్ ర్యాలీని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ తో కలిసి కలెక్టర్జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెచ్ ఐవీ ఎయిడ్స్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను తొలగించి, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షను రూపుమాపేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రతి ఆరోగ్య ఉపకేంద్రం, పీహెచ్సీల్లో అన్ని పరీక్షలతో పాటు హెచ్ఐవీ, ఎస్ టీఐ వ్యాధుల పరీక్షలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంవో వెంకటేశ్వర్లు, సీహెచ్ వో నామ్ దేవ్, వైద్యాధికారులు, ఐసీటీసీ కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.