- కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు/బెల్లంపల్లి, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను స్పీడప్ చేసి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం చెన్నూర్ మండలం కిష్టంపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, వేమనపల్లి మండలం నీల్వాయిలోని కేజీబీవీలో జరుగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. వేమనపల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ స్కూల్‌ను సందర్శించి కిచెన్, మెస్, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. చెన్నూర్ లోని 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.
వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆస్పత్రులు నిర్మించి వైద్య సేవలను అందుబాటులో ఉంచుతోందన్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ సమస్యలపై భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. చెన్నూరు తహసీల్దార్మల్లికార్జున్, ఎంపీడీవో కుమారస్వామిసంబంధిత అధికారులు పాల్గొన్నారు.
