కాబోయే భార్యను పరిచయం చేసిన మంచు మనోజ్

కాబోయే భార్యను పరిచయం చేసిన మంచు మనోజ్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌ తన ఫ్యాన్స్ కు శుభవార్త వినిపించాడు. తాను మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వెల్లడించాడు. తనకు కాబోయే భార్య భూమా మౌనికా రెడ్డి ఫొటోను తన ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. ‘‘పెళ్లికూతురు భూమా మౌనికా రెడ్డి’’ అని తెలిపాడు. #MWedsM, #ManojWedsMounika అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను జత చేశాడు. దీనిని చూసిన సినీ ప్రియులు ఆ జంటకు విషెస్ చెబుతున్నారు. వీరి వివాహం ఈ రోజు రాత్రి 8:30 గంటలకు మంచు లక్ష్మి ఇంట్లో జరగబోతున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతోపాటు, అతి కొద్ది మంది సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నట్లు సమాచారం.

మనోజ్‌ 2015లో ప్రణతీరెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పరస్పర అంగీకారంతో 2019లో వీరిద్దరూ విడిపోయారు. అలాగే మౌనికకు కూడా ఇది రెండో వివాహం. 2016లో మౌనికా రెడ్డికి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త గణేష్‌ రెడ్డితో వివాహం అయ్యింది. 2018లో మౌనికారెడ్డి-గణేష్‌ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత రెండేండ్లకు మౌనికా రెడ్డి తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటోంది.