
టాలీవుడ్ విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు వంద కోట్ల సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా మొదలుకానుందని తెలిపారు. తాజాగా తిరుమలకు వచ్చిన ఆయన ఈమేరకు అధికారిక ప్రకటన చేశాడు. జూన్ 1 గురువారం తిరుమలకు వచ్చిన మోహన్ బాబు.. వీఐపీ బ్రేక్ దర్శణంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. అక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయని, మంచి వాతావరణం ఉందని తెలిపారు.
అంతేకాదు తాము నిర్మించబోయే వంద కోట్ల సినిమా గురించి కూడా అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం విష్ణు మంచు చెబుతాడని చెప్పుకొచ్చాడు మోహన్‌బాబు. ఇక మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇష్యూపై కూడా స్పందించాడు. ఇటీవల రజనీకాంత్.. టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో గెస్ట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు రజనీ. అది కాస్త వివాదంగా మారింది. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు రజనీకాంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
అయితే మోహన్ బాబుకు ఈ విషయం పై ప్రశ్న ఎదురైంది.. "రజనీకాంత్ వ్యవహారంపై మీరు మౌనంగా ఉండటానికి కారణమేంటని ఒక రిపోర్టర్ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మోహన్ బాబు "తాను వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదని, రజనీకాంత్ గురించి మాట్లాడాలంటే ఒక రోజైనా సరిపోదని దాటవేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం మోహన్‌బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అవుతున్నాయి.