KCR నియంత ఐతే కాదు : మంచు విష్ణు

KCR నియంత ఐతే కాదు : మంచు విష్ణు

తెలుగు సినీ నటుడు మంచు విష్ణు.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించారు. ఇంటర్ వాల్యుయేషన్ లో తప్పులు.. విద్యార్థుల ఆత్మహత్యలపై జనం సీరియస్ కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. దీనిపై ప్రభుత్వం స్పందించి.. కమిటీలు వేసి.. పలు నిర్ణయాలు తీసుకుంది.

ఐతే.. విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ కొందరు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందించారు. పరీక్ష జీవితం కాదని.. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఐతే.. అధికారుల తీరుపై పెద్దగా ఎవరూ స్పందించకపోవడంతో.. ఫిలిం ఇండస్ట్రీపై కొన్ని విమర్శలు వచ్చాయి. సీఎం కేసీఆర్ కు భయపడే ప్రభుత్వాన్ని విమర్శించడం లేదంటూ కొందరు ఇండస్ట్రీ ప్రముఖులపై విమర్శలు చేశారు. ఐతే… ఈ విమర్శలను నటుడు మంచు విష్ణు తప్పుపట్టారు.

“తప్పుల కారణంగా 20మంది తమ్ముళ్లు, చెల్లెళ్ల ప్రాణాలు పోవడం చాలా దురదృష్టకరం. దారుణం. ఈ తప్పులపై సరిగా స్పందించకపోతే ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోక తప్పదు. మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. నాకు తెలిసినంతవరకు కేటీఆర్ .. చాలా క్రియాశీలకం(ప్రొయాక్టివ్)గా ఉండే నాయకుడు. విద్యార్థులకు అండగా నిలబడే రాజకీయనాయకుడు. సీఎం కేసీఆర్ కు కూడా ఫైర్ బ్రాండ్ పేరుంది. ఐనంత మాత్రాన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమీ నియంత(డిక్టేటర్) కాదు. రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేసే బదులు… ఈ గందరగోళానికి మూలమైన అసలైన కారణంపై దృష్టిపెట్టడంపై మంచిదనుకుంటున్నా. కేసీఆర్ అంటే ఇండస్ట్రీలోని వారికి భయం అని కొందరంటున్నారు. ఇందులో నిజం లేదు. ఇలాంటి సంఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకుండా ఉండేలా… అసలైన కారణాలు తెల్సుకునే పనిపైనే దృష్టిపెట్టా” అని మంచు విష్ణు వివరించారు.