మాదిగలకు 11శాతం రిజర్వేషన్ ఇవ్వాలి : మంద కృష్ణ

మాదిగలకు 11శాతం రిజర్వేషన్ ఇవ్వాలి : మంద కృష్ణ
  • లక్ష డప్పులు, వెయ్యి గొంతులు వాయిదా: మంద కృష్ణ

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎస్సీ వర్గీకరణ లిస్ట్​లో మాదిగలకు అన్యాయం చేశారని, జనాభా ప్రాతిపదికన మాదిగలకు11 శాతం ఇవ్వాల్సి ఉండగా.. 9 శాతమే ఇచ్చారని ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ సామాజిక వెనుకబాటుతనం ద్వారా చేశారా లేదా.. జనాభా ప్రాతిపదికన చేశారో క్లారిటీ లేదన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మాకు ఎవరి వాటా వద్దు.. మా వాటా ఎవరికి ఇవ్వొద్దు’ అనేది ప్రాథమిక సూత్రంగా పరిగణించి కమిషన్ కు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు.

 ఎస్సీల తరఫున కీలక పోరాటం చేస్తున్నది మాదిగలే అని అన్నారు. మాదిగల హక్కులను సాధించలేని మంత్రి దామోదర నర్సింహను తమ ప్రతినిధిగా చూడలేమని పేర్కొన్నారు.  32 లక్షలు ఉన్న మాదిగలకు ఏ ప్రాతిపదికన తీసుకున్నా 11 శాతం రిజర్వేషన్ రావాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 7న హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన ‘లక్ష డప్పులు, వెయ్యి గొంతులు’ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.