మందమర్రి గనుల్లో 70 శాతం బొగ్గు ఉత్పత్తి : జీఎం జి.దేవేందర్

మందమర్రి గనుల్లో 70 శాతం బొగ్గు ఉత్పత్తి : జీఎం జి.దేవేందర్
  • ఏడాదిలోగా ఆర్కేపీ ఓసీపీలో మైనింగ్​కార్యకలాపాలు

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులు ఏప్రిల్​లో 70శాతం ఉత్పత్తి సాధించాయని ఏరియా జీఎం జి.దేవేందర్ ​తెలిపారు. బుధవారం జీఎం ఆఫీస్​లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ లో 2,21,500 టన్నుల బొగ్గు ఉత్పత్తిని టార్గెట్​గా నిర్దేశించామని, నెలఖారు నాటికి 70 శాతంతో 1,55,276 టన్నులు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. కేకే-5 గనిలో16 వేల టన్నులకు గాను 16,765 టన్నులతో 105 శాతం ఉత్పత్తి చేసిన కార్మికులు,ఆఫీసర్లను అభినందించారు. కాసిపేట గనిలో 12,248 టన్నులు, కాసిపేట2లో 12,442 టన్నులు, శాంతిఖని గనిలో 1,403 టన్నులు, కేకే ఓసీపీలో 1,12,418 టన్నుల ఉత్పత్తి జరిగిందన్నారు. 

ఏడాదిలో నిర్దేశించిన ఉత్పత్తి టార్గెట్​ను చేరుకునేలా ప్రణాళికలు వేసి నష్టాలు పూడ్చుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేకే-5, కాసిపేట గనుల్లో రోజుకు16 డ్రిల్స్​నడువాల్సి ఉండగా 12 మాత్రమే నడుస్తున్నాయని, దీని వల్ల రోజుకు 520 టన్నుల ఉత్పత్తిని నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. బొగ్గు నిల్వలు లేకపోవడంతో ఆర్కే ఓసీపీలో మైనింగ్​ కార్యకలాపాలు నిలిచిపోయాయని, రెండో ఫేజ్​లో 366హెక్టార్ల అటవీ భూమి పర్మిషన్లు రాగానే మళ్లీ ఉత్పత్తి స్టార్ట్​చేస్తామన్నారు. సమావేశంలో ఏరియా ఏస్వోటుజీఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏరియా ఇంజనీర్ (ఈఅండ్ఎం) వెంకటరమణ, డీజీఎంలు రాజన్న, ఆర్ వీఎస్ఆర్ కే ప్రసాద్, డీవైపీఎం మైత్రేయ బందు పాల్గొన్నారు.