
- ఆందోళనలో రైతులు
- 15 జిల్లాల్లో కురిసిన వాన
- నల్గొండలో అత్యధికంగా 26.80 మిల్లీ మీటర్ల వర్షపాతం
- మరో 24గంటల పాటు మోస్తరు వర్షాలు
హైదరాబాద్/ఆసిఫాబాద్, వెలుగు : మాండౌస్ తుఫాన్ రైతులను ముంచింది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన వడ్లు పూర్తిగా తడిసిపోగా.. ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి ముద్దయ్యింది. తుఫాన్ కారణంగా 14 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. మరో 18 జిల్లాల్లో నామమాత్రంగా కొనుగోళ్లు జరిగాయి. ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల తదితర జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము దాకా వాన కురిసింది. తడిసిన పత్తి నల్లబడి తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కంది పంట కూడా దెబ్బతినే చాన్స్ ఉంది. ఆసిఫాబాద్, కౌటాల, చింతలమానెపల్లి, దహెగాం, సిర్పూర్ (టీ) మండలాల రైతులు ఇబ్బందిపడ్డారు. చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్ల కుప్పలు, బస్తాల్లో నింపిన ధాన్యం తడిసిపోయాయి. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. వడ్లు శుభ్రంగా లేవని, తేమ ఎక్కువ ఉందని 15 రోజులుగా నిర్వాహకులు కొనలేదని, అందుకే తడిసిపోయాయని రైతులు వాపోతున్నారు.
బలహీనపడిన వాయుగుండం
మాండౌస్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ రానున్న 24గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉదయం నుంచి చిరు జల్లులు కురిశాయి. గరిష్టంగా 27 డిగ్రీలు, కనిష్టంగా 19 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలోని చందంపేట్ మండలంలో 26.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, యాదాద్రి, హైదరాబాద్, వికారాబాద్, సూర్యాపేట్, మేడ్చల్ మల్కాజ్‌గిరితో పాటు ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి వానలు కురిశాయి. శనివారం ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. సోమవారం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం అరపేట గ్రామానికి చెందిన బద్దం చిన్నారెడ్డి రెండు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంట కోసి 15 రోజుల కింద మెట్ పల్లి ఏఎంసీ మార్కెట్ తీసుకొచ్చి ఆరబోశాడు. 15 రోజులైనా వడ్లు కొనలేదు. ఒకసారి ఛన్ని పట్టాలన్నారు. మరోసారి తేమ ఎక్కువగా ఉందన్నారు. తేమ 18శాతం ఉన్నకూడా కాంటా పెట్టలేదు. సంచికి 3కిలోలు తరుగు పేరిట కటింగ్ కు ఒప్పుకున్నా.. కొనలేదు. ఆదివారం రాత్రి కురిసిన వానకు వడ్లన్నీ తడిసిపోయాయి. వెంటనే వడ్లు కొంటే బాగుంటదని చిన్నారెడ్డి కోరుతున్నాడు.
వానకు వడ్లన్నీ తడిసినయ్..
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలంల ఆరబెట్టిన వడ్లన్నీ తడిసినయ్. అసలే పంట దిగుబడి తక్కువ వచ్చింది. దాంట్లో వాన పడి తడవడంతో మరింత నష్టపోవాల్సి వస్తున్నది. అధికారులు స్పందించి నష్టపరిహారం ఇప్పించాలి. లేకపోతే అప్పులు పెరిగిపోతాయ్..
- కోట జగన్, రైతు, చిన్న అయినం, దహెగాం