నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాప్ తగలబెట్టిన మందుబాబు

 నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాప్ తగలబెట్టిన మందుబాబు

దీపావళి పండగ రోజున విశాఖ పట్నంలో మందు బాబు వీరంగ సృష్టించాడు. తాను అడిగిన బ్రాండ్ మద్యం ఇవ్వలేదని  ఏకంగా వైన్స్ షాపునే తగలబెట్టాడు. వైజాగ్ లోని కొమ్మాది జంక్షన్ ఈ ఘటన చోటు చేసుకుంది.

స్థానిక సాయిరాం కాలనీకి చెందిన గుమ్మడి మధు అనే వ్యక్తి  వైన్స్ షాప్ దగ్గరకు వచ్చి.. ఓ బ్రాండ్ మద్యం కావాలని అడిగాడు. ఆ బ్రాండ్ తమ దగ్గర లేదని సిబ్బంది చెప్పారు. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న మధుకి ఆ మాటలు నచ్చలేదు. దీంతో కోపంతో ఊగిపోయి.. వాటర్ బాటిల్ లో పెట్రోల్ తెచ్చి వైన్స్ షాపుపై పోసి నిప్పంటించాడు. 

ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల విలువైన 15 లిక్కర్ బాటిల్ కేసులు, ప్రింటర్, కంప్యూటర్, స్కానర్, ఫ్రిజ్ పూర్తిగా కాలిపోయాయి. వైన్స్ షాపు సిబ్బంది భయంతో పరుగులు తీశాడు. స్థానికులు మంటలను ఆర్పేశారు.. నిందితుడు మధును పట్టుకొని పోలీసులకు అప్పగించారు.