పని లేని వాళ్లే బీఆర్ఎస్ లో చేరుతున్నారని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, తెలంగాణలో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసీసీ నేత, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. ఇవాళ ఏఐసీసీ ఆఫీసు వద్ద ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, నాయకులు అన్నె కిష్టప్ప, ముద్దప్పా దేశ్ ముఖ్ తదితరులు ఠాక్రేను కలిశారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లయితే పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని ఠాక్రే ప్రశ్నించారు. కేసీఆర్ మహారాష్ట్ర టూర్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, తెలంగాణలో సంపాదించిన అవినీతి సొమ్మును మహారాష్ట్రలో ఖర్చు చేస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో భారీ సంఖ్యలో చేరికలు ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం పార్టీలో చేరుతున్న వారికి ఎలాంటి హామీలు ఇవ్వడం లేదని, సర్వేలు, గెలుపు ప్రాతిపదికనే టికెట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు.
