
ఫిబ్రవరి 16న జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మొదట కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ ముఖ్యమంత్రి కావచ్చునని వార్తలు వచ్చాయి. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో సాహాను తిరిగి పదవి వరించింది. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అగర్తలాలో జరిగిన సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హాజరయ్యారు. వాళ్లతో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండా, మణిపూర్ సీఎం ఎన్ బీరెన్, సిక్కిం సీఎం పీఎస్ తమంగ్ కూడా హాజరయ్యారు.
మాణిక్ సాహా.. పోయినసారి ఉన్న మంత్రులు రతన్ లాల్ నాథ్, ప్రణజిత్ సింఘా రాయ్, శంతన చక్మా, సుశాంత చౌదరిలను ఈసారి కూడా కొనసాగించారు. వాళ్లతోపాటు ముగ్గురు కొత్త మంత్రులకు ఛాన్స్ దక్కింది. బిప్లబ్ దేబ్‌కు సన్నిహితుడైన టింకు రాయ్, షెడ్యూల్డ్ తెగల మోర్చా చీఫ్ బికాష్ దేబ్బర్మ, సుధాన్షు దాస్ లకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) పార్టీ నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. ఆ పార్టీ నుంచి సుక్లా చరణ్ నోటియా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.