
ఇంఫాల్ : మణిపూర్‌లోని ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నేట్ సేవలను తిరిగి ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హింసాత్మక సంఘటనలు జరగని జిల్లా కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను స్టార్ట్ చేయాలని చీఫ్ జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, జస్టిస్ గోల్మే గైఫుల్‌షిల్లు కబుయ్‌ల డివిజన్ బెంచ్ ఆదేశించింది.
మొబైల్ ఇంటర్నెట్ సేవలపై బుధవారం వరకు నిషేధం విధించడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది. అలాగే, మిగతా ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపులో ఉంటే ఇంటర్నేట్ నిషేధాన్ని ఎత్తివేయాలని సూచించింది. మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధం ఎత్తివేతకు సంబంధించి జారీచేసిన ఉత్తర్వుల కాపీలను వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేయాలని చెప్పింది.
ఆపై విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. రాష్ట్రంలో మైతీ, కుకీ, నాగాల మధ్య హింస చెలరేగడంతో సెప్టెంబర్‌లో కొన్ని రోజులు మినహా, మే 3 నుంచి మణిపూర్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించారు.