మూడు నెలలుగా మార్చురీలోనే 35 డెడ్ బాడీలు

 మూడు నెలలుగా మార్చురీలోనే 35 డెడ్ బాడీలు
  •   కేంద్రంతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని కుకీ తెగ నాయకుల వెల్లడి
  •    డిమాండ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని పట్టు 

ఇంఫాల్ : మణిపూర్ అల్లర్లలో చనిపోయిన కుకీ తెగకు చెందిన 35 మంది సామూహిక అంత్యక్రియలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం (ఐటీఎల్ఎఫ్) గురువారం ప్రకటించింది. కేంద్ర హోం శాఖతో చర్చలు జరిపిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని ఐదు రోజులు వాయిదా వేస్తున్నామని తెలిపింది. అంతకు ముందు సామూహిక అంత్యక్రియల నేపథ్యంలో చురాచాంద్​పూర్, బిష్ణుపూర్ జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా ఐటీఎల్ఎఫ్ లీడర్లు మాట్లాడారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల దాకా సమావేశం అయ్యామని, హోంమంత్రిత్వ శాఖ రిక్వెస్ట్ చేయడంతో అంత్యక్రియలను  వాయిదా వేసుకున్నామన్నారు. తాము అనుకున్న చోటే డెడ్​బాడీలను సమాధి చేయడానికి భూమిని ప్రభుత్వం చట్టబద్ధం చేయనుందని, మిజోరం  సీఎం కూడా ఇదే హామీ ఇచ్చారని తెలిపారు. 

హామీ ఇవ్వకుంటే.. అక్కడే అంత్యక్రియలు

తమ ఐదు డిమాండ్లపై కేంద్ర హోం శాఖ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని ఐటీఎల్ఎఫ్ లీడర్లు స్పష్టం చేశారు. లేదంటే తాము అనుకున్న చోటే సామూహిక అంత్యక్రియలు జరుపుతామని తేల్చి చెప్పారు. కుకీల డిమాండ్లపై కేంద్రం కూడా స్పందించింది. సామూహిక అంత్యక్రియల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. కాగా, చురాచాంద్​పూర్ జిల్లా హవోలై ఖోపి సమీపంలోని ఎస్ బోల్జాంగ్‌‌‌‌లో గిరిజన సంప్రదాయం ప్రకారం సామూహిక ఖననం జరగనుంది. అంత్యక్రియల కోసం తీసుకెళ్లాల్సిన 35 డెడ్​బాడీలు మూడు నెలలుగా మార్చురీలోనే ఉన్నాయి.

కుకీల ఐదు డిమాండ్లు ఇవే..

సామూహిక ఖననం చేసే ప్రదేశాన్ని చట్టబద్ధం చేయాలని, కుకీ జో ప్రజల భద్రతకు అన్ని కొండ ప్రాంత జిల్లాల్లో మైతీలున్న దళాలను మోహరించకూడదని కుకీలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే 
ఇంఫాల్‌‌‌‌లో ఉన్న కుకీ జో కమ్యూనిటీకి చెందిన వారి డెడ్​బాడీలను చురచాంద్​పూర్​కు తేవాలని, రాజకీయ పరంగా తమను మణిపూర్ నుంచి వేరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని,  ఇంఫాల్‌‌‌‌ గిరిజన జైల్లోని ఖైదీలను భద్రత కోసం ఇతర రాష్ట్రాలకు తరలించాలని కోరుతున్నారు. 

తెల్లవారుజామున పిటిషన్​పై విచారణ

చురాచాంద్​పూర్ జిల్లా హవోలై ఖోపి వద్ద సామూహిక అంత్యక్రియలపై స్టేటస్ కో కొన సాగించాలని మణిపూర్‌‌‌‌ హైకోర్టు ఆదేశించింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా గురువారం పొద్దున5 గంటలకే అత్యవసర విచారణ జరిపిన అనంతరం హైకోర్టు యాక్టింగ్ చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఎంవీ మురళీ ధరన్‌‌‌‌ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. కాగా, బిష్ణుపూర్ జిల్లాలో గురువారం ఆందోళనకారులు, భద్రతాదళాలకు మధ్య జరిగిన  ఘర్షణల్లో 17 మంది గాయపడ్డారు. దీంతో ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ జిల్లాలకు చెందిన ఇద్దరు మేజిస్ట్రేట్లు కర్ఫ్యూ సడలింపులను ఉపసంహరించుకున్నారు.