
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రణరంగంగా మారింది. మణిపూర్‌లో గిరిజనుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తూ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మణిపూర్ లోని గిరిజన సంఘాలు నిరసనలకు దిగాయి. నిరసనకారులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టారు. ఇంపాల్, చురాచంద్‌పూర్, కంగ్‌పోక్కి ప్రాంతాల్లో హింస చెలరేగింది. దీంతో ఎనిమిది జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
కర్ఫ్యూ విధింపు...
గిరిజన గ్రూపుల ఆందోళనలతో మణిపూర్ రాష్ట్రంలోని 8 జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా కొన్నిచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. వీటిని అదుపు చేయడానికి ఆర్మీ , అసోం రైఫిల్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ ఫ్లాగ్ పహారా కాస్తున్నారు. ఇప్పటివరకు సమస్యాత్మక ప్రాంతాల్లోని 7,500 మంది ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. రాజధాని ఇంఫాల్, చుర్‌చంద్‌పూర్, కాంగ్‌పోక్పి సహా పలు జిల్లాల్లో ఉద్రిక్తతల తారాస్థాయికి చేరుకోవడంతో మణిపుర్ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
అమిత్ షాతో..
మణిపూర్ లో జరుగుతోన్న తాజా పరిణామాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. బుధవారం ఘర్షణలు చెలరేగిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం చేపడుతున్న చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.
దయ చేసి ఆదుకోండి..
మణిపూర్లో హింసాత్మక ఘటనలను జరుగుతుండటంపై బాక్సర్ మేరీకోమ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 03వ తేదీ నుంచి మణిపూర్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందన్నారు. హింసలో అనేక మంది తమ కుటుంబసభ్యులను కోల్పోవడం బాధగా ఉందని పేర్కొంది. మా రాష్ట్రం మణిపూర్ తగలబడిపోతోంది.... దయచేసి రక్షించండి.. అని మేరీకోమ్ ట్విట్టర్‌లో అభ్యర్ధించింది.
అసలు వివాదం ఏంటి...
మణిపూర్ జనాభాలో మైతీ సామాజిక వర్గం 53 శాతం ఉంటుంది. ముఖ్యంగా ఇంఫాల్ లోయలో వీరి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. వీరిని షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు కోర్టు కూడా అంగీకరించింది. దీంతో మైతీ వర్గానికి గిరిజన హోదా ఇవ్వడంపై స్థానిక గిరిజనులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బెంగాలి మాట్లాడే మైతీ తెగ ప్రజలు బ్రాహ్మణ వర్గం వారు. ప్రధానంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. స్థానికంగా ఎస్టీ హోదా అనుభవిస్తున్న గిరిజనులు ఆచార వ్యవహారాల్లో ఎక్కువగా క్రైస్తవ మతం ఆచరిస్తుంటారు.మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వటంపై మొదటి నుంచి గిరిజన తెగలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
మైతీలు ఏమంటున్నారు?
మయన్మార్,బంగ్లాదేశ్‌నుంచి పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా అక్కడి ప్రజలు మణిపూర్ రాష్ట్రంలోకి వలస వస్తున్నారు. వీరివల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని మైతీలు వాదిస్తున్నారు. తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఇంఫాల్ లోయలోని రాజకీయ నాయకులు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నారు.