దిల్‌‌ వాలే దుల్హానియా లే జాయేంగే సినిమాకు లండన్‌‌లో అరుదైన గౌరవం

దిల్‌‌ వాలే దుల్హానియా లే జాయేంగే సినిమాకు లండన్‌‌లో అరుదైన గౌరవం

బాలీవుడ్‌‌ లవ్‌‌ స్టోరీస్‌‌లో ‘దిల్‌‌ వాలే దుల్హానియా లే జాయేంగే’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ సినిమా చరిత్రలో అత్యద్భుత ప్రేమకథగా ఈ సినిమాను కీర్తిస్తారు. షారుఖ్, కాజోల్ జంటగా యశ్ రాజ్ ఫిల్మ్స్‌‌ నిర్మాణంలో ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ క్లాసిక్ మూవీ .. ఇప్పటికీ ముంబైలోని మరాఠా మందిర్ అనే థియేటర్‌‌‌‌లో ప్రదర్శించబడుతోంది. మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న  ఈ సినిమాకు ఇప్పుడు లండన్‌‌లో అరుదైన గౌరవం దక్కింది. 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లండన్‌‌లోని లీసెస్టర్ స్క్వేర్ వద్ద.. లీడ్ రోల్స్‌‌ అయిన రాజ్‌‌, సిమ్రాన్‌‌ పాత్రలకు సంబంధించిన ఐకానిక్‌‌ స్టిల్‌‌ను కాంస్య విగ్రహంగా ఏర్పాటుచేశారు. 

అక్కడ ఆవిష్కరించబడ్డ తొలి ఇండియన్‌‌ సినిమా ఇదే కావడం విశేషం. హ్యారీ పోటర్‌‌‌‌, బ్యాట్‌‌ మ్యాన్‌‌, వండర్‌‌‌‌ ఉమెన్ లాంటి ఐకానిక్ క్యారెక్టర్స్‌‌ సరసన ఇప్పుడీ విగ్రహం స్థానం సంపాదించుకుంది. ఈ విగ్రహావిష్కరణకు షారుఖ్, కాజోల్‌‌ స్వయంగా హాజరయ్యారు. షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ ‘మనుషుల మధ్య ఉండే అడ్డంకులను ప్రేమ ఎలా తొలగిస్తుందో ఇందులో  చూపించాం. 

ఈ సినిమా వల్ల ఇప్పటికీ ప్రేక్షకుల ప్రేమను పొందుతున్నాం.  ఇది మాకు ఎమోషనల్ మూమెంట్’ అని చెప్పారు. తమ సినిమాను ఇంతకాలం హృదయాల్లో దాచుకున్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా కాజోల్‌‌ ధన్యవాదాలు చెప్పారు.