మనీష్ సిసోడియా భారతరత్నకు అర్హుడు

మనీష్ సిసోడియా భారతరత్నకు అర్హుడు

న్యూఢిల్లీ/అహ్మదాబాద్: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని చీల్చి, మెజార్టీ ఎమ్మెల్యేలతో వచ్చి బీజేపీలో చేరితే సీఎం పోస్ట్ ఇస్తామని తనకు ఆఫర్ వచ్చిందంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలోకి వస్తే తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను మూసివేస్తామని కూడా బీజేపీకి చెందిన ఓ నేత నుంచి మెసేజ్ వచ్చిందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాను ఏ1గా చేర్చిన సీబీఐ ఇటీవల ఆయన ఇంట్లో సోదాలు చేయడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీబీఐ సోదాల తర్వాత రోజూ బీజేపీ, ఆప్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సిసోడియా సోమవారం బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందంటూ ట్వీట్ చేశారు. ‘‘నేను మహారాణా ప్రతాప్ వారసుడిని. రాజ్ పుత్ ను. తల తెగిపడినా సరే కానీ కుట్రదారులు, అవినీతిపరుల ముందు తలవంచను. మీకు ఏం కావాలంటే అది చేస్కోండి” అని పేర్కొన్నారు.

ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తో కలిసి గుజరాత్ పర్యటనకు వెళ్లిన సిసోడియా అక్కడ కూడా మీడియాతో మాట్లాడారు. బెంగాల్ లో సువేందు అధికారి, అస్సాంలో హిమంత బిశ్వశర్మ, మహారాష్ట్రలో నారాయణ్ రాణే, తదితరులు బీజేపీలో చేరేలా తానే మధ్యవర్తిత్వం వహించినట్లు సదరు బీజేపీ నేత చెప్పారన్నారు. అయితే, ఆయన పేరును వెల్లడించేందుకు నిరాకరించారు. ‘‘కేజ్రీవాల్ నా రాజకీయ గురువు. నేను సీఎం లేదా పీఎం అయ్యేందుకు పాలిటిక్స్ లోకి రాలేదు. కేజ్రీవాల్ కు ఎన్నటికీ ద్రోహం చేయనని వాళ్లకు స్పష్టమైన సమాధానం ఇచ్చాను” అని ఆయన తెలిపారు.    

సిసోడియా భారతరత్నకు అర్హుడు: కేజ్రీవాల్ 

‘‘ఢిల్లీ గవర్నమెంట్ స్కూళ్లలో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ను అద్భుతంగా మెరుగుపరుస్తున్నందుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, విద్యా శాఖల మంత్రి మనీశ్ సిసోడియా భారతరత్న అవార్డుకు అర్హుడు. కానీ రాజకీయ కారణాలతో కేంద్రం ఆయనను సీబీఐ, ఈడీ కేసులతో వేధిస్తోంది” అని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. సోమవారం ఆయన అహ్మదాబాద్ లో సిసోడియాతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్​ను న్యూయార్క్ టైమ్స్ పత్రిక కూడా మెచ్చుకుందన్నారు. ‘‘గవర్నమెంట్ స్కూళ్లను 70 ఏండ్లలో ఏ పార్టీ బాగుచేయలేకపోయిన పరిస్థితుల్లో.. కేవలం ఐదేండ్లలో విద్యారంగంలో అద్భుతాలు సాధించిన వ్యక్తిపై ఇలా సీబీఐ దాడులు చేయించడానికి సిగ్గుపడాలి” అని మండిపడ్డారు. ఆప్​ను గెలిపిస్తే గుజరాత్​లో నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామన్నారు. సీబీఐ, ఈడీ దాడుల ద్వారా ఢిల్లీలో తన ఆధ్వర్యంలోని సర్కారును కూల్చేందుకు ప్రయత్నాలు జరిగాయని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ లోటస్’ ఫెయిల్ అయిందంటూ ట్వీట్ చేశారు.

ఆ లీడర్ ఎవరో చెప్పాలె: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ  

బీజేపీకి చెందిన ఏ లీడర్ నుంచి ఆఫర్ వచ్చిందో చెప్పాలంటూ సిసోడియాను బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. ‘‘సిసోడియా ఫోన్ ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. మరి ఎవరి ఫోన్ ద్వారా ఆయనకు కాల్ లేదా మెసేజ్ వచ్చిందో చెప్పాలి. ఆ వ్యక్తి పేరు చెప్పి, ఫోన్ ను సీబీఐకి హ్యాండోవర్ చెయ్యాలి’’ అని ట్వీట్ చేశారు. అలాగే అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకే ఆప్ నేతలు కేజ్రీవాల్, సిసోడియా తమను తాము బాధితులుగా చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా  విమర్శించారు.