Manoj Manchu: హిస్టారిక‌ల్ యాక్ష‌న్ జోనర్లో మనోజ్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

Manoj Manchu: హిస్టారిక‌ల్ యాక్ష‌న్ జోనర్లో మనోజ్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

మంచు మనోజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడిక మనోజ్ తనదైన పంథాలో విభిన్న సినిమాలు చేస్తూ ఆశ్యర్యపరుస్తున్నారు. 

ఇవాళ (ఆగస్ట్ 6న) హీరో మంచు మనోజ్ తన కొత్త సినిమా ప్రకటించాడు. ఈ సంవ‌త్స‌రంతో టాలీవుడ్ హీరోగా 21 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనోజ్ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. 

ఈ సందర్భంగా మనోజ్ X లో పోస్ట్ చేస్తూ సినిమా వివరాలు వెల్లడించారు. ‘కృతజ్ఞతతో నిండిన హృదయంతో.. కొత్త సినిమా వివరాలు పంచుకుంటున్నాను. తెలుగు సినీ రంగంలో నా ప్రయాణానికి నేటితో 21 సంవత్సరాలు. నేను ఇష్టపడే సినిమారంగాన్ని ఇప్పటికీ వదలకుండా ఉండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మరియు అదే ప్రేమ మరియు ఆశతో, నా 21వ చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ని పంచుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు నా వెంట నిలిచిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. రాబోయే డేవిడ్ రెడ్డి సినిమా కోసం  ఉత్సాహంగా ఉన్నానని’ మనోజ్ నోట్ ద్వారా వెల్లడించారు.  

కొత్త దర్శకుడు హ‌నుమా రెడ్డి య‌క్కంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు డేవిడ్ రెడ్డి అనే విభిన్న టైటిల్ ఫిక్స్ చేశారు.  వెల్వ‌ట్ సోల్ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై మోత్కూరి భ‌ర‌త్, న‌ల్ల‌గంగుల వెంక‌ట్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

►ALSO READ | బాక్సాఫీస్ టఫ్ ఫైట్: ‘కూలీ’vs‘వార్ 2’.. అడ్వాన్స్ బుకింగ్స్లో ఏ సినిమా సత్తా చాటుతుంది?

ఈ మూవీ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఈ కథ 1897-1922 సంవ‌త్స‌రాల మ‌ధ్య బ్రిటీష్ కాలం నేప‌థ్యంలో సాగనుంది. మ‌ద్రాస్ ప్రెసిడోన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగి బ్రిటీష్ వారిని గడ‌గ‌డ‌లాడించిన రెబ‌లీయ‌న్‌ వ్య‌క్తి క‌థ‌గా ఈ సినిమా ఉండ‌నుందని సినీ వర్గాల టాక్. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్. 

ప్రస్తుతం మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’, వాట్ ద ఫిష్ సినిమాలతో సోలోగా వస్తున్నాడు. అలాగే తేజ సజ్జా హీరోగా వస్తోన్న మిరాయ్ లో విలన్ గా కనిపించనున్నారు. మరో రెండు సినిమాలు హీరోగా లైన్ లో పెట్టేశాడు. 2004లో దొంగ దొంగ‌ది మూవీతో పూర్తిస్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.