ఫ్రెండ్‌కి డ్రగ్స్ ఇచ్చి చంపిన స్నేహితులు

ఫ్రెండ్‌కి డ్రగ్స్ ఇచ్చి చంపిన స్నేహితులు

లుథియానా: పంజాబ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఫ్రెండ్‌కి అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి అతడి చావుకు కారణమయ్యారు కొంతమంది స్నేహితులు. ఈ దారుణ ఘటన లుథియానాలో చోటుచేసుకుంది. లుథియానాకు చెందిన 30 ఏళ్ల విశాల్ ఖేరా భామియా రోడ్‌లోని గురు‌నానక్ నగర్ నివాసి. అతడు టీ షర్ట్ ప్రింటింగ్ ఫ్యాక్టరీని రన్ చేస్తున్నాడు. గత నెల జూలై 30న కంపెనీ ఆర్డర్ డెలివరీ చేయడానికి బయటకు వెళ్లాడు. కానీ, మళ్లీ తిరిగిరాలేదు. మరుసటి రోజు చక్ సర్వన్ నాథ్‌లో సొంత కారులోనే ప్యాసింజర్ సీటులో శవమై కనిపించాడు. తన కొడుకును అతని స్నేహితులే చంపేశారని ఖేరా తండ్రి ఆరోపిస్తున్నాడు.

‘హర్జీత్ సింగ్, సామ్రాట్ అనే ఇద్దరు స్నేహితులు నా కొడుకుతో కారులో బయటకు వెళ్లారు. సింగ్ మరియు ఖేరా ఎప్పటినుంచో స్నేహితులు. కానీ సామ్రాట్ మాత్రం నా కొడుకుకు తెలియదు. నా కొడుకు మందు తాగుతాడు కానీ, డ్రగ్స్ తీసుకునే అలవాటులేదు. బయటకు వెళ్లిన నా కొడుకు మరుసటి రోజు తన కారులోనే ప్యాసింజర్ సీటులో అపస్మారకస్థితిలో ఉన్నాడు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. నిందితులిద్దరూ నా కొడుకు శరీరంలోకి బలవంతంగా డ్రగ్స్ ఇంజెక్ట్ చేశారు. అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లినా.. ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. ఖేరా నోటి నుంచి రక్తం కూడా కారింది. డ్రగ్స్ ఓవర్ డోస్ ఇవ్వడంతో ఖేరా కిడ్నీ ఫెయిలైందని వైద్యులు తెలిపారు’ అని ఆయన అన్నారు.

ఖేరాకు డ్రగ్స్ ఇచ్చిన తర్వాత అతని స్నేహితులు కారు నడుపుతూ సిటీ మొత్తం తిరిగారని కూమ్‌కలాన్ పోలీస్ స్టేషన్ ఎస్సై హర్ష్‌పాల్ సింగ్ తెలిపారు. ‘నిందితులలో ఒకరు ఖేరా చేతిని పట్టుకోగా.. మరోకరు అతనికి డ్రగ్ ఇచ్చారు. డ్రగ్ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఖేరా స్పృహ కోల్పోయాడు. అయితే ఖేరా కాసేపటి తర్వాత మేల్కొంటాడని భావించిన నిందితులు.. కారులోనే తిరుగారు. కానీ ఎంతసేపయినా ఖేరా లేవకపోవడంతో.. నిందితులు భయంతో కారును వదిలి పారిపోయారు’ అని ఎస్సై తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని స్టేషన్ ఆఫీసర్ అన్నారు. నిందితలపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు హౌజ్ ఆఫీసర్ తెలిపారు.