29 నిమిషాల పాటు వృశ్చికాస‌నం.. వ‌ర‌ల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియ‌న్‌

29 నిమిషాల పాటు వృశ్చికాస‌నం.. వ‌ర‌ల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియ‌న్‌

దుబాయ్‌లో ఉన్న భార‌తీయ యోగా టీచ‌ర్ గిన్నిస్ వ‌రల్డ్ రికార్డులకెక్కాడు. 29 నిమిషాల పాటు వృశ్చికాస‌నం వేసి, ఔరా అనిపించాడు. య‌శ్ మ‌న్సూక్‌భాయ్ మొరాదియా వేసిన వృశ్చికాసనం వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. తేలు(వృశ్చికాస‌నం) ఆకారంలో 21 ఏళ్ల య‌శ్ మ‌న్సూక్‌భాయ్ మొరాదియా వేసిన యోగా అంద‌ర్నీ ఆకట్టుకుంటోంది. గ‌తంలో ఇదే ఆస‌నాన్ని 4 నిమిషాల 47 సెకన్ల పాటు వేసిన రికార్డును బద్దలు కొట్టాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ యోగా డే (జూన్ 21న) సంద‌ర్భంగా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌(GWR) ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. 

వృశ్చికాస‌నం అడ్వాన్సడ్ యోగా క్యాట‌గిరీలోకి వ‌స్తుంది. 2001లో పుట్టిన మ‌న్సూక్ 8 ఏళ్ల వ‌య‌సులో యోగా జ‌ర్నీ స్టార్ట్ చేశాడు.  2010 నుంచి అత‌ను ప‌వ‌ర్ యోగా చేస్తున్నాడు. ఈ ఆసనం చాలా సేపు వేసేందుకు దాదాపు రెండేళ్ల పాటు చాలా కష్టపడ్డాడు. వృశ్చికాస‌నం ప్రకారం ముంజేతులను నేలపై, కాళ్ళను వంపు చేసి తలపై ఉంచాలి.

‘వృశ్చికాస‌నం అనేది స్థిరత్వానికి సంబంధించినది. ఎంత ఎక్కువ సేపు చేస్తే అంత బాగా మానసిక స్థితిని బాగు చేసుకునే అవకాశం ఉంటుంది’ అని మ‌న్సూక్‌భాయ్ గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌ ప్రతినిధులకు తెలియజేశాడు. 2010 నుండి క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం మొదలుపెట్టాడు. గిన్నిస్‌ రికార్డు సృష్టించేందుకు రెండేళ్లపాటు సిద్ధమయ్యాడని ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో మొరాదియా తన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఆ టైమ్ లోనే వృశ్చికాస‌నాన్ని ప్రాక్టీస్ చేశాడని చెప్పారు.