వరద..బురద తొలగట్లే! .. దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు

వరద..బురద తొలగట్లే! .. దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు

 

హైదరాబాద్, వెలుగు:   వరుసగా కురుస్తున్న వానలతో  నగరంలోని చాలా కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నా యి. ఆరు రోజులు కురిసి తగ్గుముఖం పట్టినా వరద నీరు ఇంకా తొలగడం లేదు. కొన్ని చోట్ల చెరువులు నిండి కాలనీల్లో వరద ప్రవహిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగడంతో రోడ్లపై మురుగునీరు పారుతోంది. ఇంకా ఆయా కాలనీల్లోని జనాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వరదనీటిలో డ్రైనేజీ మురుగు కలుస్తుండగా తీవ్ర దుర్వాసన వస్తోంది.  అయినా బల్దియా అధికారులు అందుకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధిత కాలనీల జనాలు విమర్శిస్తున్నారు. 

వరద తగ్గని కాలనీలు ఇవే..

గాజుల రామారంలోని వోక్షిత్ కాలనీ ఇంకా నీటిలోనే ఉంది.  షేక్ పేట్ లోని ఓయూ కాలనీ, బేగంపేట్‌లోని మయూరి మార్గ్, టోలిచౌక్​లో వరద నీటితో కష్టాలు పడుతూనే ఉన్నారు. వనస్థలిపురంలోని అల్తాఫ్ నగర్‌‌లో  డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుతోంది. జవహర్ నగర్, నిజాంపేట్, బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, నార్సింగి, మణికొండ, మేడ్చల్ అన్ని చోట్ల ఇలాంటి సమస్యలు ఎక్కువయ్యాయి.  జవహర్ నగర్ లోని 8 వార్డు సంతోష్​ నగర్లో  రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. బడంగ్ పేట్‌లోని నాదర్ గూల్‌లో రోడ్లు పూర్తిగా కరాబ్ కావడంతో సాయిబాబా టెంపుల్ ప్రాంతంలో వర్షపునీరు నిలిచిపోయింది.  కార్పొరేషన్‌లో చెట్లు పెరిగిపోవడంతో  లైట్ల వెలుతురు రోడ్లపై పడటం లేదు.  జనం ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.  నిజాంపేట్‌లో రోడ్లు డ్యామేజ్‌తో ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచిపోయింది.  బాచుపల్లిలో రోడ్లపై వర్షపు నీరు రోజుల తరబడి తొలగడం లేదు. 

గత అనుభవాల దృష్ట్యా..

2020లో వరదలు వచ్చిన సమయంలో నగరంలో వందల కాలనీలు నీట మునిగాయి. 500 కాలనీల్లో తీవ్ర నష్టం జరిగింది.  8  నుంచి 10 సెంటిమీటర్ల వర్షం పడితే చాలు ఇండ్లు, కాలనీలు నీట మునుగుతున్నాయి. గాజుల రామారంలో మూడు కాలనీల్లో గతేడాది నుంచి ఇబ్బందులు పడుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.  మల్కాజిగిరిలోని సఫెల్ కాలనీలోనూ నాలాలు చిన్నగా ఉండటంతో పూర్తిగా కాలనీల్లోంచి నీరు పారుతోంది. 

శివారు ప్రాంతాల్లో నిధులున్నా.. 

జీహెచ్ఎంసీలో  ఫండ్స్​ లేకపోవడంతో పనులు కొనసాగడం లేదు. శివారు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఫండ్స్​ఉన్నా పనులు చేయడం లేదు.  బోడుప్పల్, పీర్జాదిగూడ,  జవహర్‌నగర్, నిజాంపేట్‌,  బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్‌,  మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 22 మున్సిపాలిటీలను రాష్ట్ర  ప్రభుత్వం ఆదుకోవడం లేదు.  పన్నుల రూపంలో వస్తున్న వాటితో  మున్సిపాలిటీల్లో నిధులు భారీగానే ఉన్నాయి. ఒకటి, రెండు తప్ప కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రమే ఫండ్స్​తక్కువగా ఉన్నాయి.  మిగతా వాటిలో ఒక్కో కార్పొరేషన్​ లో రూ.10 నుంచి రూ.20 కోట్ల వరకు, మున్సిపాలిటీల్లో  రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు వివిధ రూపాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫండ్స్​ఉన్నాయి.  వీటిని జనం కోసం ఖర్చు పెట్టేందుకు మేయర్లు, చైర్మన్లు ముందుకు రావడం లేదు.

మరో నాలుగు రోజులు..

సిటీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నేడు(సోమవారం) తేలికపాటిగా, మంగళ, బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.