కాబుల్ లో 150 మంది కిడ్నాప్..వీరిలో భారతీయులే ఎక్కువ

కాబుల్ లో 150 మంది కిడ్నాప్..వీరిలో  భారతీయులే ఎక్కువ

ఆఫ్గనిస్తాన్ లో అరాచకాలకు తెగబడుతున్నారు తాలిబాన్లు. కాబూల్ ఎయిర్ పోర్ట్ దగ్గర 150 మందిని కిడ్నాప్ చేసినట్టు ఆఫ్గన్ మీడియా రిపోర్ట్ చేసింది. తాలిబాన్లు కిడ్నాప్ చేసినవారిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారని తెలిపింది. అయితే తాలిబాన్ అధికార ప్రతినిధి అహ్మదుల్లా వసేఖ్ ఖండించారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. కానీ ఆప్గన్ మీడియా మాత్రం కథనాలను ప్రసారం చేస్తూనే ఉంది. ఎవాక్యుయేషన్ కోసం కాబూల్ ఏయిర్ పోర్ట్ దగ్గర వేచి చూస్తున్నవారిని తాలిబాన్లు కిడ్నాప్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 

మరోవైపు ఈ ఉదయమే 85 భారతీయులను కాబూల్ నుంచి లిఫ్ట్ చేసింది భారత్. ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానంలో వీరిని తీసుకొస్తున్నారు. కాబూల్ నుంచి టేకాఫ్ అయిన తజకిస్తాన్ లోని డుషాన్బే ఎయిర్ పోర్ట్ కు వెళ్లింది. అక్కడ్నుంచి ఆ విమానం భారత్ రానుంది. ఇక కాబూల్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఫోర్స్ కు చెందిన C-17 ట్రాన్స్ పోర్ట్ విమానం స్టాండ్ బైగా ఉంచారు. ఆఫ్గనిస్తాన్ లో ఇంకా 150 నుంచి 180 మంది వరకు భారతీయులు ఉండి ఉంటారని అంచనా. త్వరలోనే వారిని కూడా క్షేమంగా తీసుకొస్తామని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.

తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కాబూల్ చేరుకున్నాడు. ప్రభుత్వ ఏర్పాటు అతను కార్యాచరణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాలిబాన్ సంస్థలోని ఇతర నాయకులతో అతను చర్చలు సాగిస్తున్నాడు. ఇంతకుముందు అంతర్జాతీయ సమాజం, ఆప్గన్ లోని పార్టీలతో తాలిబాన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు కోసం అబ్దుల్ ఘనీ బరాదర్ మరోసారి జిహాదీ నాయకులు, రాజకీయ నాయకులతో మాట్లాడతారని తాలిబాన్ వర్గాలు తెలిపాయి.