బీఆర్​ఎస్​లో ఆత్మీయత లేదు..ఉద్యమకారులను పట్టించుకోలే

బీఆర్​ఎస్​లో ఆత్మీయత లేదు..ఉద్యమకారులను పట్టించుకోలే
  •     నిజాలు చెబితే  జీర్ణించుకోలే
  •     కార్యకర్తలు ఏడ్చిన పార్టీ బాగుపడదు 
  •     బీఆర్ఎస్​ కాదు టీఆర్ఎస్​గానే సంబోధిస్తాం
  •     బీఆర్ఎస్ రివ్యూ​ మీటింగ్​లో పలువురు లీడర్లు

యాదాద్రి, వెలుగు :  కండువాలు కప్పుడే బలమనుకున్నారని, నిజాలు చెబితే పట్టించుకోక పోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని పలువురు బీఆర్​ఎస్​ లీడర్లు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోని బీఆర్​ఎస్​లో ఆత్మీయత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తన్నీరు  హరీశ్​రావు, గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి హాజరయ్యారు. వారిద్దరి ఎదుటే నేతలు  జిట్టా బాలక్రిష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర్​రెడ్డి, కొలుపుల అమరేందర్

మార్కెట్​ కమిటీ చైర్మన్​ పైళ్ల రాజవర్దన్​ రెడ్డి సహా పలువురు లీడర్లు వివిధ అంశాలు లేవనెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓడిపోయిందో వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిని పదేండ్లుగా పట్టించుకోలేదన్నారు. ఇతర పార్టీల్లో బలమైన లీడర్లుగా ప్రచారమైన వారిని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇతర పార్టీల్లో ఎంపీపీలు, సర్పంచ్​లుగా గెలిచిన వారికి కండువాలు కప్పి బీఆర్​ఎస్​లో చేర్చుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కొత్తగా వచ్చని వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి.. మొదటి నుంచీ ఉన్నవాళ్లను, కార్యకర్తలను పట్టించుకోలేదన్నారు.

ఎక్కడైనా కార్యకర్తలు ఏడ్చిన పార్టీ బాగుపడలేదన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎండ్రుకిచ్చలు బీఆర్​ఎస్​ పడవలో నిండిపోయాయని, ఆ ఎండ్రికిచ్చలు కొరకరడం వల్లనే బీఆర్​ఎస్​ పడవ మునిగిపోయిందని చెప్పుకొచ్చారు. పార్టీలో ఉంటూనే మనోళ్లు గెలవరంటూ ప్రచారం చేశారని, అలాంటి వాళ్లనే పార్టీలో నమ్మారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమీ ఆశించని పార్టీ కార్యకర్తలు గెలుపు కోసం కష్టపడ్డారే కానీ మోసం చేయలేదన్నారు. కాంగ్రెస్​లో సాధారణ లీడర్​గా  ఉన్న కుంభం అనిల్​కుమార్​ రెడ్డిని

బీఆర్​ఎస్​లో చేర్చుకొని ఎక్కువ ప్రియారటీ ఇవ్వడం వల్ల తప్పు చే శారని పరోక్షంగా కేసీఆర్​ను విమర్శించారు. ఏకంగా హెలీక్యాప్టర్​లోనే ఎక్కించుకొని తిప్పి.. ఎక్కడలేని పబ్లిసిటీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పరిణామాలను వివరించినా.. ఎవ్వరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

జడ్పీ చైర్మన్​ను అవమానించినా పట్టించుకోరా? : చింతల వెంకటేశ్వర్​రెడ్డి

జడ్పీ చైర్మన్ సందీప్​రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి అవమానించినా పార్టీలో పెద్దగా పట్టించుకోలేదని పార్టీ లీడర్​ చింతల వెంకటేశ్వర్​రెడ్డి వాపోయారు. పార్టీ నుంచి పదవులు ఉండగానే..సరిపోదని కార్యకర్తలను చూసుకోవాలని హితవు పలికారు.  పార్టీలో ఉంటున్న తననే పదేండ్లుగా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలోనే ఉంటూ ఓటమికి కారణమయ్యారు :  కొలుపుల అమరేందర్​

బీఆర్​ఎస్​లోనే ఉంటూ పైళ్ల శేఖర్​రెడ్డి ఓడి పోయేలా చేశారని రైతుబంధు మాజీ చైర్మన్​  కొలుపుల అమరేందర్​ అన్నారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వారికి ప్రియారిటీ ఇచ్చారని చెప్పారు. పార్లమెంట్​ ఎన్నికల్లో అందరం సమన్వయంగా పని చేసి ఎంపీగా పైళ్ల శేఖర్​రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. 

బీఆర్​ఎస్​ అనను : జిట్టా బాలక్రిష్ణారెడ్డి

బీఆర్​ఎస్​గా సంబోధించడం తనకు ఇష్టం లేదని ఆ పార్టీ స్టేట్​ లీడర్​  జిట్టా బాలక్రిష్ణారెడ్డి అన్నారు. ఇప్పటికీ టీఆర్​ఎస్​గా సంబోధిస్తానని చెప్పారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను వివరించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోని వారు చెప్పినట్టుగా చేస్తే.. 50 వేల మెజారిటీతో గెలిచేవారని తెలిపారు.