2023  ఏం తెస్తోంది?

2023  ఏం తెస్తోంది?

మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది.  2022 కి గుడ్‌‌బై చెప్పి 2023కి వెల్‌‌కమ్ చెప్పడానికి ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. 2022 సంవత్సరం చాలామందికి గుర్తుండిపోతుంది. కరోనా మహమ్మారి నుంచి బయటపడి ప్రపంచం కాస్త కోలుకున్న సంవత్సరం ఇదే. అయితే వచ్చే ఏడాది ఇంతకంటే బెటర్‌‌‌‌గా ఉండబోతోంది. రోజువారీ జీవితం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకూ వచ్చే ఏడాది ఎన్నో కొత్త మార్పులు రాబోతున్నాయి. హాలీవుడ్ రేంజ్ సినిమాలు, తీరు మారే ఉద్యోగాలు, కంఫర్ట్ జోన్ దాటి చేసే ప్రయాణాలు, కొత్తరకం హెల్త్ ట్రీట్మెంట్లు ఇలా.. 2023 చాలా కొత్తగా ఉండబోతోంది. 2023వ సంవత్సరంలో ఎలాంటి మార్పులు ఎక్స్‌‌పెక్ట్ చేయొచ్చంటే..

కరోనా తర్వాత పరిస్థితులు నార్మల్ అవ్వడానికి దాదాపు సంవత్సరం టైం పట్టింది. ప్రజలు  ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. ఈ ఏడాది యుద్ధం, మాంద్యం లాంటి సమస్యలతో పాటు  5జీ లాంటి కొత్త టెక్నాలజీలు, ఆస్కార్ వరకూ వెళ్లిన సినిమాలు, ఉర్రూతలూగించిన ఫిఫా వరల్డ్ కప్ లాంటి మంచి మెమరీస్ కూడా ఉన్నాయి.  అయితే రాబోయే ఏడాది 2023 కూడా ఇలాంటి కొన్ని మిక్స్‌‌డ్ మెమరీస్  అందివ్వబోతోంది.      

లైఫ్‌‌స్టైల్ ఇలా..

ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది లైఫ్‌‌స్టైల్ కొంత మారుతుంది. ఆరోగ్యం, తిండి, ప్రయాణాల విషయంలో కొత్త ట్రెండ్స్‌‌ ఎక్స్‌‌పెక్ట్ చేయొచ్చు. కొవిడ్ తర్వాత నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నవాళ్ల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోందని స్టడీలు చెప్తున్నాయి. హెల్త్‌‌కు సంబంధించిన విషయాలను గూగుల్‌‌లో వెతికి తెలుసుకోవడం కూడా గత రెండేండ్లుగా ఎక్కువైంది. ఇదే ట్రెండ్ వచ్చే ఏడాది కూడా కనిపించబోతోంది. హెల్దీ లైఫ్ కోసం టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం మరింత ఎక్కువవుతుంది. ఆరోగ్యాన్ని మానిటర్ చేసే స్మార్ట్ డివైజ్‌‌ల వాడకం కూడా పెరుగుతుంది.

వచ్చే ఏడాది మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ వాడకం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో స్మార్ట్‌‌ ఫోన్లు వాడుతున్న వాళ్లు 80 కోట్ల మంది ఉంటే వచ్చే ఏడాది ఆ సంఖ్య ఏకంగా 100  కోట్లకు పెరగనుంది. అంతేకాదు, 5జీ లాంటి హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల ఇంటర్నెట్ వాడకం 40 శాతం పెరుగుతుందట. దీన్నిబట్టి చూస్తే ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది లైఫ్ మరింత స్మార్ట్‌‌గా మారే అవకాశం కనిపిస్తోంది.

వచ్చే ఏడాది ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు కనిపించొచ్చని స్టడీలు చెప్తున్నాయి. కరోనాకు తోడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఫుడ్ ఎగుమతులు, దిగుమతుల్లో సమస్యలొచ్చాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని దేశాలన్నీ లోకల్ ఫుడ్‌‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయని ‘ఆస్ట్రియన్ ఫుడ్ రిపోర్ట్ 2023’ అంటోంది. మల్టీ నేషనల్ ఫుడ్ బ్రాండ్స్ ధరలు పెరగొచ్చని, లోకల్ రెస్టారెంట్లు, లోకల్ పంటలకు ఎక్కువ డిమాండ్ ఉండొచ్చని ఆ రిపోర్ట్ చెప్తోంది. దీంతోపాటు వచ్చే ఏడాది  ‘ల్యాబ్ గ్రోన్ మీట్’ అంటే  జంతువులను చంపకుండా ల్యాబ్‌‌లో తయారు చేసే మాంసం అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే దేశంలో చాలా కంపెనీలు మొక్కల నుంచి మాంసాన్ని తయారుచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి అందరికీ అందుబాటులోకి వస్తాయి. అలాగే మైక్రో గ్రీన్స్, వెగన్ ఫుడ్స్, జీరో వేస్ట్ కుకింగ్ లాంటి కొత్త ఫుడ్ ట్రెండ్స్ కూడా 2023లో కనిపించొచ్చు.

కొత్త ఉద్యోగాలు

ఈ ఏడాది చాలామందిని ఇబ్బంది పెట్టిన మరో సమస్య.. ఉద్యోగాలు కోల్పోవడం.  అయితే 2023 మార్చి తర్వాత ఐటీ కంపెనీల్లో మళ్లీ జాబ్ ఓపెనింగ్స్ మొదలవ్వొచ్చు. కాగ్నిజెంట్, హెచ్‌‌సీఎల్, విప్రో, టెక్ మహీంద్ర లాంటి టాప్ ఐటీ సంస్థలు 2023 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా లక్షా 40 వేల ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు ప్రకటించాయి. ఇందులో  ఫ్రెషర్స్‌‌ను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. అలాగే డేటాను స్టోర్ చేయడంలో క్లౌడ్‌‌ యూనిట్లు ప్రస్తుతం ‘కీ’ రోల్ పోషిస్తున్నాయి. అందుకే 2023లో చాలాకంపెనీలు మరిన్ని డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. దీనివల్ల కూడా జాబ్ ఓపెనింగ్స్ పెరుగుతాయి. ఇటీవల చేసిన ఓ సర్వేలో తమ బిజినెస్, ప్రాఫిట్‌‌లకు 2023వ సంవత్సరం పాజిటివ్‌‌గా  ఉంటుందని దేశంలోని 42 శాతం కంపెనీలు చెప్పాయి. వచ్చే ఏడాది ఐటీ సెక్టార్‌‌‌‌లో 65.5%, ఇంజినీరింగ్‌‌ లో52.9%, సేల్స్‌‌ అండ్ మార్కెటింగ్ లో 35.4%,  ఫైనాన్స్‌‌ రంగంలో17.5% జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయని ఆ  సర్వేలో వెల్లడైంది. అంటే 2023లో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్న మాట. అంతేకాదు, మరో గుడ్ న్యూస్ ఏంటంటే  కిందటేడాది మనదేశంలోని కంపెనీలు శాలరీల కోసం కేటాయించిన బడ్జెట్‌‌..  2023లో 10 శాతం మేర పెరగొచ్చని  ‘గ్లోబల్‌‌ అడ్వైజరీ, విలిస్ టవర్స్‌‌ వాట్సన్‌‌’ రిపోర్ట్  పేర్కొంది. అంటే ఉద్యోగులకు జీతాలు పెరిగే ఛాన్స్ కూడా ఉందన్న మాట.

రాబోయే ఏడాది అన్నిరంగాల్లో జీతాలు పెరగొచ్చు.  ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్‌‌, టెక్నాలజీ, మీడియా అండ్  గేమింగ్‌‌ రంగాల్లో శాలరీ హైక్స్  వరుసగా 10.4 %, 10.2 %, 10 శాతంగా ఉండనున్నాయి. వచ్చే ఏడాది టెక్నాలజీ, డిజిటల్‌‌ స్కిల్స్ తెలిసిన వాళ్ల అవసరం పెరుగుతుంది. కాబట్టి అలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే వచ్చే ఏడాది జాబ్ ఓపెనింగ్స్‌‌లో జనరేషన్ జెడ్.. అంటే 1996 తర్వాత పుట్టిన వాళ్లకే ఎక్కువ అవకాశం ఇవ్వాలని కంపెనీలు కోరుకుంటున్నాయట. 

గగన్ యాన్

కొత్త సంవత్సరంలో విశ్వాన్ని మరింత లోతుగా పరిశోధించేందుకు ఇండియా రెడీ అవుతోంది. ఇప్పటివరకూ అమెరికా, యూరప్ లాంటి దేశాలకే పరిమితమైన రికార్డ్‌‌ను 2023లో ఇండియా బ్రేక్‌‌ చేయబోతోంది. ఫస్ట్  హ్యూమన్ స్పేస్ మిషన్.. ‘గగన్ యాన్’ కోసం ఇస్రో (ఇండియన్‌‌ స్పేస్‌‌ రీసెర్చ్‌‌ ఆర్గనైజేషన్‌‌) పట్టుదలతో పనిచేస్తోంది.  మన ఆస్ట్రోనాట్స్‌‌ను మన సొంత టెక్నాలజీతో స్పేస్‌‌లోకి  పంపేందుకు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.  గగన్‌‌ యాన్‌‌ మిషన్.. ఫిబ్రవరి 2023లో లాంఛ్ అవ్వొచ్చు.  ఈ మిషన్ కోసం నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను ఎంచుకొని ట్రైనింగ్ ఇస్తున్నారు. హ్యూమన్ స్పేస్ మిషన్ గగన్‌‌ యాన్‌‌ను 2023లో ఎలాగైనా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భూమి ఆర్బిట్‌‌లోకి మన సొంత లాంచ్‌‌ వెహికిల్‌‌ ద్వారా మనుషులను పంపి, తిరిగి సేఫ్‌‌గా భూమికి తీసుకురావడం ఈ మిషన్‌‌ టార్గెట్. 

ధరలు తగ్గుతాయా?

ఈ ఏడాది అనుకోకుండా వచ్చి పడిన రష్యా–ఉక్రెయిన్‌‌ యుద్ధం- తిండి గింజలు, వంట నూనె, పెట్రోల్ ధరలను అమాంతం పెంచేసింది. వచ్చే ఏడాదైనా  ధరలు తగ్గుతాయా? అంటే తగ్గకపోవచ్చనే అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్. యుద్ధం ఎటూ తేలనంత వరకూ ఈ సమస్యకు పరిష్కారం దొరకనట్టే. కొన్ని స్టడీల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వంట నూనె, కూరగాయల ధరలు వచ్చే ఏడాది కూడా ఇలాగే ఉండొచ్చు అని లేదా ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. అయితే మనదేశంలో మాత్రం 2023 ఏప్రిల్‌‌ నుంచి మొదలయ్యే కొత్త  ఆర్థిక సంవత్సరంలో ధరల పెరుగుదల 5 శాతానికి తగ్గుతుందని ఆర్‌‌‌‌బీఐ అంచనా వేసింది. 2023 చివరినాటికి ప్రపంచంలో ఇన్‌‌ఫ్లేషన్ 4.7శాతానికి తగ్గుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్తోంది. 

వర్కింగ్ స్టైల్ మారొచ్చు

ఈ ఏడాది ఉద్యోగుల్లో కనిపించిన మూన్ లైటింగ్, క్వైట్ క్విట్టింగ్ లాంటి కొత్త ట్రెండ్స్ కంపెనీల మైండ్‌‌ సెట్‌‌ను మార్చాయి. దీనివల్ల వచ్చే ఏడాది వర్కింగ్ స్టైల్ కొంత మారబోతోంది. ఉద్యోగుల్ని అట్రాక్ట్ చేసేందుకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ఫ్లెక్సిబిలిటీ వర్క్‌‌ కల్చర్‌‌ లాంటివి అందించేలా సంస్థలు ఆలోచిస్తున్నాయి.ఫ్లెక్సిబుల్ వర్క్, హైబ్రిడ్ వర్క్ పేరుతో కంపెనీలు కొత్త విధానాలను తీసుకొస్తున్నాయి. 

‘హైబ్రిడ్‌‌ వర్కింగ్’ మోడల్‌‌లో వారంలో మూడు రోజులు ఆఫీసుకు వెళ్లాలి. మిగతారోజులు ఇంటి నుంచి పనిచేసుకోవచ్చు. అలాగే ‘ఫ్లెక్సిబుల్ వర్కింగ్’ మోడల్ పేరుతో కంపెనీలు మల్టిపుల్ శాటిలైట్ ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నాయి. అంటే ఉద్యోగులు మెయిన్ ఆఫీసుకు రాకుండా దగ్గర్లో ఉన్న హైబ్రిడ్ స్టేషన్‌‌కు వెళ్లి పనిచేసుకోవచ్చు. కొన్ని చోట్ల ఇప్పటికే ఈ ట్రెండ్ నడుస్తోంది. 2023 నాటికి మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో ‘ఫ్లెక్సిబుల్ వర్క్‌‌స్పేస్’ 60 మిలియన్ చదరపు అడుగులను దాటుతుందని ‘కొలియర్స్’ సంస్థ తమ రిపోర్ట్‌‌లో వెల్లడించింది.

ఎక్కువ జనాభా దేశంగా..

కొన్ని సంవత్సరాలుగా మనదేశ జనాభా పెరుగుతూ వస్తోంది. అయితే  వచ్చే ఏడాది నాటికి చైనాను దాటి.. ఇండియా ప్రపంచంలోనే ఎక్కువ జనాభా గల దేశంగా ఉండబోతోంది.  ఇప్పుడు రెండో ప్లేస్‌‌లో ఉన్న ఇండియా 2023 నాటికి ఫస్ట్ ప్లేస్‌‌కు వెళ్తుంది.  జనాభా లెక్కల ప్రకారం.. ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు కాగా, ఇండియా జనాభా 141.2 కోట్లు ఉంది. వచ్చే ఏడాది నాటికి ఇండియా జనాభా చైనా ఫిగర్‌‌ను దాటేస్తుంది.

చదువుల్లో మార్పులు

వచ్చే ఏడాది మెటావర్స్ టెక్నాలజీ ఆన్‌‌లైన్ చదువులను పూర్తిగా మార్చేయనుంది. స్కూళ్లు, కాలేజీల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్‌‌ ఏర్పాటు కావొచ్చు. వచ్చే ఏడాది హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స్, మార్కెటింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, యూఎక్స్ కోర్సులకు మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది కొత్తగా రాబోతున్న ‘గేమిఫికేషన్’ అనే పద్ధతి ద్వారా ఏ విషయాన్నైనా ఒక ఆటలాగా నేర్చుకునే వీలుంటుంది. అలాగే ‘నానో టెక్నాలజీ’ అనే మరో ట్రెండ్ చాలా కోర్సులను ఈజీ చేస్తుంది. సబ్జెక్ట్‌‌ను ముక్కలుగా విడగొట్టి చిన్నచిన్న కోర్సులు, ప్రాజెక్టుల రూపంలో  విషయాన్ని మరింత త్వరగా, వివరంగా నేర్చుకునే వీలుంటుంది.

 స్టాక్ మార్కెట్

వచ్చే ఏడాది నిఫ్టీ 20,000 పాయింట్లను తాకొచ్చని అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ బ్యాంకింగ్‌‌ సంస్థ ‘బోఫా సెక్యూరిటీస్‌‌’ అంచనా వేసింది. 2023లో మధ్య, చిన్న షేర్లతో పోలిస్తే పెద్ద షేర్లు రాణించొచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది చివరికి ఇన్‌‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) సాధారణ స్థాయికి చేరొచ్చట.

ట్రావెల్ ట్రెండ్స్

వచ్చే ఏడాది ప్రయాణాలు కూడా కొత్తగా ఉండబోతున్నాయి. 2023 లో  కేవలం ఎంజాయ్ చేయడానికే కాదు, ట్రావెల్ చేయడానికి రకరకాల కారణాలుండొచ్చని స్టడీలు చెప్తున్నాయి. అందులో ముఖ్యమైంది ‘రివెంజ్ ట్రావెల్’. అంటే గత కొంతకాలంగా ఎటూ వెళ్లలేకపోయిన వాళ్లు ‘కనీసం ఈసారైనా ట్రిప్‌‌‌‌కు వెళ్లాలి’ అనే ఉద్దేశంతో ట్రావెల్ చేయడమన్న మాట. ఈ ట్రెండ్ వచ్చే ఏడాది ఎక్కువగా కనిపిస్తుందట. 2023లో ఫ్లైట్ టికెట్ బుకింగ్స్, సెర్చ్ చేసిన రిపోర్ట్స్‌‌‌‌ను బట్టి చూస్తే.. ఈ ఏడాదితో పోలిస్తే  వచ్చే ఏడాదిలో ప్రయాణాలు దాదాపు 200శాతం పెరుగుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా 2023 ఏప్రిల్– నవంబర్ నెలల మధ్య ఎక్కువమంది ప్రయాణాలు చేయాలనుకుంటున్నారు. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది ఫారిన్ టూర్లు కూడా పెరగబోతున్నాయి.  వచ్చే ఏడాది ఎక్కువమంది వెళ్లాలనుకుంటున్న దేశాల లిస్ట్‌‌‌‌ను ‘లోన్లీ ప్లానెట్’ ఇటీవల రిలీజ్ చేసింది. ఈ లిస్ట్‌‌‌‌లో ‘ఈట్’, ‘జర్నీ’, ‘కనెక్ట్’, ‘లెర్న్’, ‘అన్‌‌‌‌వైండ్’ అనే కేటగిరీలున్నాయి. డిఫరెంట్ రుచులను ఎక్స్‌‌‌‌ప్లోర్ చేయాలనుకునే వాళ్లు వచ్చే ఏడాది పెరూ, ఇటలీ, జపాన్, మలేసియా, ఉరుగ్వే, సౌత్ ఆఫ్రికా దేశాలను ఎంచుకున్నారు. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయాలనుకునేవాళ్లు కెనడా, భూటాన్, పరాగ్వే, కొలంబియా, టర్కీ, ఆస్ట్రేలియా దేశాలను ఎంచుకున్నారు.  ఏదైనా నేర్చుకోవడం లేదా చదువుకోవడం కోసం జర్మనీ, ఫ్రాన్స్, యుకె, స్కాట్‌‌‌‌లాండ్, అమెరికా దేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. వీటితోపాటు వర్చువల్ టూర్లు, ట్రీట్మెంట్ కోసం వెళ్లే టూర్లు, కంఫర్ట్ జోన్ దాటి చేసే అడ్వెంచర్లు, సోలో టూర్లు కూడా వచ్చే ఏడాది పెరగబోతున్నాయి.

ఇన్సులిన్ ట్యాబ్లెట్ వస్తోంది

ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది మెంటల్ హెల్త్ చెకప్‌‌ల సంఖ్య పెరుగుతుందని కొన్ని స్టడీలు చెప్తున్నాయి. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏటా పెరుగుతున్నాయి. 2023 నుంచి రెగ్యులర్ హెల్త్ చెకప్ లాగానే మెంటల్ హెల్త్  చెకప్‌‌లు కూడా కామన్ అయిపోతాయి. మానసిక సమస్యలకు కొత్త రకం థెరపీలు అందుబాటులోకి వస్తాయి. మెంటల్ హెల్త్ క్లినిక్‌‌ల సంఖ్య పెరుగుతుంది. మానసిక సమస్యలను ధైర్యంగా డాక్టర్‌‌‌‌కు చెప్పుకునే ట్రెండ్ మొదలవుతుంది.డీఎన్ఏలో మార్పులు చేయగలిగే ‘అడ్వాన్స్‌‌డ్ జీన్ ఎడిటింగ్’ థెరపీకి వచ్చే ఏడాది అప్రూవల్ రానుంది. దీంతో రకరకాల జబ్బులను తగ్గించడం ఈజీ అవుతుంది. ‘బయో ప్రింటింగ్’ అనే మరో టెక్నాలజీ ద్వారా అవయవాల మార్పిడి మరింత తేలిగ్గా జరుగుతుంది. అలాగే ‘బయో ఇంజనీర్డ్ టిష్యూస్’ అనే కొత్తరకం మజిల్స్ కూడా 2023లో రాబోతున్నాయి. ఇవి సర్జరీ, గాయాలను త్వరగా మానేలా చేయగలవు.

వచ్చే ఏడాది ఇంట్లోనే డయాగ్నస్టిక్ టెస్ట్‌‌లు చేసుకునే ‘ఎట్ హోమ్ డయాగ్నస్టిక్ కిట్’లు రాబోతున్నాయి. వెల్‌‌నెస్ మెటావర్స్ అనే టెక్నాలజీ వచ్చే ఏడాది నుంచి వాడుకలోకి రావొచ్చు. అంటే వర్చువల్ హెల్త్ చెకప్‌‌లు, ఆన్‌‌లైన్ ఫిట్‌‌నెస్ క్లాసులు, వర్చువల్ వర్కవుట్లు లాంటివి ఇకనుంచి  పెరుగుతాయన్న మాట. దీంతో జిమ్‌‌లకు వెళ్లే పని తగ్గుతుంది.  ప్రతీ చిన్న దానికి హాస్పిటల్‌‌కు వెళ్లే అవసరం తగ్గుతుంది. ట్రీట్మెంట్‌‌లన్నీ స్మార్ట్‌‌గా మారతాయి. అలాగే ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్న ‘మాలిక్యులర్ హైడ్రోజన్ థెరపీ’లు వచ్చే ఏడాది నుంచి మనదేశంలో కూడా అందుబాటులోకి రావొచ్చు. ఆస్తమా, సీఓపీడీ, కీళ్ల నొప్పులు, డయాబెటిస్, బీపీ, ట్రైగ్లిజరాయిడ్స్, ఇన్‌‌సోమ్నియా లాంటి సమస్యలకు ఈ థెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. డయాబెటిస్ పేషెంట్ల కోసం ఇన్సులిన్‌‌ను  ట్యాబ్లెట్ రూపంలో తీసుకురావాలని ఎప్పటినుంచో ప్రయోగాలు జరుగుతున్నాయి.  2023లో ఇన్సులిన్ ట్యాబ్లెట్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

కొత్త టెక్నాలజీలు 

టెక్ లవర్స్‌‌కు 2023.. ఓ కొత్త శకం అని చెప్పొచ్చు. వచ్చే ఏడాది టెక్నాలజీలో వచ్చే మార్పులు ఎవరూ ఊహించని విధంగా ఉండబోతున్నాయి. వీటిలో అన్నింటికంటే ముఖ్యమైంది ‘వెబ్ 3.0’. 1991 లో మొదలైన వరల్డ్ వైడ్ వెబ్‌‌లో ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ‘3.0’ రాబోతుంది. ‘వెబ్ 0.0’ లో ఇంటర్నెట్‌‌లో టెక్స్ట్ ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ జరిగేది. 1994 నుంచి 2000 వరకూ నడిచిన ‘వెబ్ 1.0’ లో ఇంటర్నెట్‌‌లో సెర్చింగ్ మొదలైంది. 2000  తర్వాత వచ్చిన ‘వెబ్ 2.0’తో రకరకాల వెబ్‌‌సైట్లు, సోషల్ మీడియా లాంటివాటికి అవకాశం ఏర్పడింది. అయితే 2023 లో రాబోతున్న ‘వెబ్ 3.0’తో ఇంటర్నెట్ ఫ్యూచర్ మారబోతోంది. ఇంటర్నెట్ కమ్యూనికేషన్‌‌లో ఇది కొత్త మార్పులు తీసుకురాగలదు. ఇంటర్నెట్‌‌లో ఉండే రకరకాల సైట్లు యూజర్ల డేటాను ఉపయోగించుకుంటాయి. వెబ్ 3.0 లో అది కుదరదు. డేటాను ఉపయోగించుకుంటే యూజర్లకు పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఇంటర్నెట్ అందరికీ ఓపెన్‌‌గా, సేఫ్‌‌గా అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్‌‌పై ఎవరూ అధికారం చెలాయించలేరు. ఇది సెక్యూరిటీ, ప్రైవసీని మరింత మెరుగుపరుస్తుంది. డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్(డాప్స్) పేరుతో పనిచేసే కొత్త అప్లికేషన్లు రాబోతున్నాయి. ఇవి మల్టిపుల్ సర్వర్లతో పనిచేస్తాయి. ఇవి వస్తే ఇంటర్నెట్‌‌లో ఉండే థర్డ్ పార్టీ యాప్స్, సాఫ్ట్‌‌వేర్స్‌‌పై ఆధారపడాల్సిన  పని ఉండదు. ఇవి వెబ్‌‌సైట్‌‌లు, యాప్‌‌లు..  మెషీన్ లెర్నింగ్ , బిగ్ డేటా, డీసెంట్రలైజ్డ్‌‌ లెడ్జర్ వంటి టెక్నాలజీల ఆధారంగా పనిచేస్తాయి. మనుషుల  తరహాలో డేటాను ఉపయోగించుకుని, దాన్ని కంట్రోల్ చేస్తూ పనిచేయగలవు. 


వచ్చే ఏడాది ‘సూపర్ యాప్స్’ కూడా కనువిందు చేయనున్నాయి. ఒకే యాప్‌‌తో పలు రకాల పనులు చేసుకునే సూపర్  యాప్స్ ఇప్పటికే కొన్ని ఉన్నాయి. వచ్చే ఏడాది వాటి సంఖ్య మరింత పెరగొచ్చు. ‘టాటా నియో’, ‘జియో’, ‘పేటీఎం’, ‘ఎస్‌‌బీఐ యోనో’ వంటి కొన్ని యాప్‌‌లను సూపర్ యాప్‌‌లుగా చెప్పుకోవచ్చు. ఇవి ఒకటి కంటే ఎక్కువ ఫీచర్లు, సర్వీస్‌‌లను అందిస్తాయి. 

ఇక వీటితోపాటు వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం రెట్టింపు అవుతుందని అంచనా. అలాగే ఎయిర్ ట్యాక్సీలు కూడా చాలాదేశాల్లో కనిపించబోతున్నాయి.
వచ్చే ఏడాది  మొబైల్ ఫోన్స్ వాడకం, సేల్స్ దాదాపు డబుల్ అయ్యే అవకాశం ఉంది.   ఆరోగ్యాన్ని మానిటర్ చేసుకోవడం కోసం కొత్త కొత్త వేరబుల్ గాడ్జెట్లు వస్తాయి. అంటే స్మార్ట్ వాచీలు, ఫిట్‌‌నెస్ బ్యాండ్‌‌లతో పాటు మొండి జబ్బులను కూడా ట్రాక్ చేసే గాడ్జెట్లు వస్తాయన్న మాట. మెదడులో చిప్ పెట్టి బ్రెయిన్‌‌ను కంప్యూటర్​తో  లింక్ చేసే టెక్నాలజీని 2023లో ఎక్స్‌‌పెక్ట్ చేయొచ్చు. 

మెగా స్పోర్ట్స్ ఈవెంట్స్

స్పోర్ట్స్ లవర్స్‌‌కు 2023.. డబుల్ కిక్ ఇవ్వనుంది. క్రికెట్, హాకీ, సాకర్.. ఇలా చాలా ప్రపంచకప్‌‌లు జరగబోతున్నాయి. ముఖ్యంగా 2023లో జరగబోతున్న వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌‌ పోటీలు ఈ సారి మనదేశంలో జరుగుతాయి. ఇండియా ఇప్పటివరకు మూడు సార్లు 1987, 1996, 2011లో ప్రపంచకప్‌‌ను హోస్ట్ చేసింది. అయితే ఈ మూడు సార్లు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ , శ్రీలంకలతో కలిసి హోస్ట్ చేసింది. అయితే, ఈసారి మాత్రం కేవలం ఇండియా ఒక్కటే హోస్ట్ చేయనుంది. 1983, 2011 తర్వాత మూడోసారి కప్ గెలుచుకోవడం కోసం ఇండియా ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. అందుకే ఈసారి హాట్ ఫేవరెట్‌‌గా బరిలో నిలవనుంది.  అలాగే  ‘అండర్-19 ఉమెన్స్‌‌ టీ20’ ప్రపంచకప్‌‌ను తొలిసారిగా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ‘అండర్ 19 ఉమెన్స్‌‌ టీ20’ ప్రపంచకప్ 2023 లో జరగనుంది. జనవరిలో 16 జట్లతో ఈ టోర్నీ జరుగుతుంది. 

జనవరి 13, 2023  నుంచి హాకీ వరల్డ్ కప్ జరగబోతోంది. ఈ కప్‌‌ను కూడా ఇండియానే హోస్ట్ చేస్తుంది. ఇందులో 26 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. హాకీలో ఇండియా ప్రపంచ కప్ గెలిచి చాలా ఏండ్లు అయింది. 2023లో మన హాకీ జట్టు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇక వీటితోపాటు ఫిబ్రవరి 10 నుంచి ‘ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్’ జరగనుంది. ఇందులో 10 టీమ్స్ పాల్గొంటాయి.  2023 మార్చిలో ‘ఉమెన్స్ ఐపీయల్’ జరిపేందుకు కూడా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఇందులో ఐదు టీంలు ఉండే అవకాశం ఉంది. ప్రతీ టీంలో ఐదుగురు విదేశీ ప్లేయర్స్ ఉంటారు. ఏప్రిల్‌‌లో హాట్ ఫేవరెట్ ‘ఐపీయల్ 16’ జరగనుంది. ఆ తర్వాత జులైలో ‘ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్’, సెప్టెంబర్‌‌‌‌లో ‘ఏషియన్ గేమ్స్’ జరగనున్నాయి.

మిల్లెట్ ఇండియా

మిల్లెట్స్‌‌(చిరుధాన్యాలు)కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. ఇందులో భాగంగానే  ఇండియా ప్రపోజల్‌‌ను ఆమోదిస్తూ 2023వ సంవత్సరాన్ని ‘చిరుధాన్యాల ఏడాది(ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్)’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బంగ్లాదేశ్‌‌, కెన్యా, నేపాల్‌‌, నైజీరియా, సెనెగల్‌‌, రష్యా దేశాలతో కలిపి ఇండియా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మరో 70 దేశాలు దాన్ని సపోర్ట్ చేశాయి. దాంతో 2023 ‘ఇంటర్నేషనల్‌‌ ఇయర్‌‌ ఆఫ్‌‌ మిల్లెట్స్‌‌’ గా డిక్లేర్ అయింది.  ఇందులో భాగంగా ఐక్యరాజ్య సమితి ఇండియాతో కలిసి ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్‌‌ను ప్రమోట్ చేస్తుంది. అన్నిదేశాల్లో మిల్లెట్స్ పండించేలా , మిల్లెట్ ఫుడ్స్‌‌ను మార్కెటింగ్ చేసేలా రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొస్తారు.

సినిమాలు

సినిమా లవర్స్‌‌కు ఈ ఏడాది రిలీజైన సినిమాలు ఫుల్ జోష్‌‌నిచ్చాయి. అయితే ఇదే ఊపు వచ్చేఏడాది కూడా ఉండబోతోంది.  ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్‌‌గా నిలిచిన సినిమాల సీక్వెల్స్, అలాగే మరికొన్ని క్రేజీ కాంబినేషన్ మూవీలు 2023లో రాబోతున్నాయి. వచ్చే ఏడాది కూడా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోని సినిమాలు అందర్నీ అలరిస్తాయి. అయితే ఎప్పుడూ లేనివిధంగా వచ్చే ఏడాది సీక్వెల్స్‌‌కు సంబంధించి పెద్ద లిస్ట్ కనిపిస్తోంది. టాలీవుడ్‌‌లో ఇప్పటికే ‘పుష్ప2’, ‘డీజే టిల్లు2’, ‘భారతీయుడు2’ సినిమాలు షూటింగ్ స్టేజ్‌‌లో ఉన్నాయి. అలాగే ‘అఖండ’కి సీక్వెల్ ఉంటుందని బాలకృష్ణ ఇప్పటికే  అనౌన్స్‌‌ చేశాడు. వచ్చే ఏడాదిలో ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌‌గా ‘ఆదిత్య 999’ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కిస్తామని బాలకృష్ణ  చెప్పాడు. ‘హిట్‌‌ 3’ కోసం నాని రంగంలోకి దిగుతున్నాడు. రామ్‌‌చరణ్‌‌ ‘ధృవ’కి సీక్వెల్‌‌గా దర్శకుడు మోహన్‌‌రాజా ఓ కథని రెడీ చేశారు. అన్నీ కుదిరితే ఆ మూవీ  కూడా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. వీటితోపాటు ‘కార్తికేయ 3’, ‘బింబిసార 2’, ‘ఢీ అండ్‌‌ ఢీ’ (డబుల్‌‌ డోస్‌‌), ‘గూఢచారి 2’, ‘ఫలక్‌‌నుమా దాస్‌‌ 2’, ‘ఎఫ్3’.. ఇలా ఇప్పటికే ప్రకటించిన సీక్వెల్ సినిమాల లిస్ట్ చాలానే ఉంది.

కోలీవుడ్‌‌ నుంచి సూర్య నటించిన ‘జై భీమ్‌‌’, కార్తి నటించిన ‘సర్దార్‌‌’ సినిమాలు.. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’, ‘ఆషికి 3’, ‘ఓ మై గాడ్‌‌ 2’, ‘క్రిష్‌‌ 4’, ‘టైగర్‌‌ 3’..  ఇలా చాలా సీక్వెల్‌‌లు ప్రొడక్షన్ స్టేజ్‌‌లో ఉన్నాయి.  మోహన్‌‌లాల్‘లూసిఫర్‌‌ 2’ , ‘దృశ్యం3’ సీక్వెల్స్‌‌తో మాలీవుడ్ రెడీగా ఉంది.  లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 2023లో విజయ్ సినిమా రాబోతుంది.  వీటితో పాటు సాలార్, ఆర్‌‌‌‌సీ 15, ఎన్టీఆర్ 30,  పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబో మూవీ, నాని ‘దసరా’, షారుక్ ‘పఠాన్’, ‘హరిహర వీరమల్లు’, మహేష్ బాబు 28, షారుక్ ‘జవాన్’ లాంటి మోస్ట్ అవెయిటెడ్ సినిమాలతో పాటు  ‘మీర్జాపూర్ 3’, ‘పాతాళ్ లోక్ 2’ , ‘ది  ఫ్యామిలీ మ్యాన్ 3’, ‘గన్స్ అండ్ గులాబ్స్’ లాంటి వెబ్ సిరీస్‌‌లు కూడా వచ్చే ఏడాది ఓటీటీలో అలరించనున్నాయి. హాలీవుడ్ విషయానికొస్తే  2023 బాక్సాఫీస్‌‌ను బ్రేక్ చేసేందుకు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10’, ‘ది మార్వెల్స్’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘స్పైడర్ మ్యాన్’ సిరీస్‌‌ల్లోని సినిమాలు రాబోతున్నాయి.  2023లో ఓటీటీ మార్కెట్ విలువ, ఓటీటీ కంటెంట్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది ఓటీటీ  వ్యూయర్‌‌‌‌షిప్ మూడు రెట్లు పెరుగుతుందని ఒక అంచనా.
:::తిలక్​