గ్లోబల్ అనిశ్చితి ఉంటే సేఫ్ హెవెన్ గా డాలర్

గ్లోబల్ అనిశ్చితి ఉంటే సేఫ్ హెవెన్ గా డాలర్

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు: రూపాయి బలహీన పడడం లేదని,  డాలర్ వాల్యూనే బలపడుతోందని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, డేటా చూస్తే  రూపాయి ఫండమెంటల్స్‌‌లో పెద్దగా మార్పులేవి రాలేదు. మరోవైపు డాలర్ మాత్రం ఆర్టిఫీషియల్‌‌గా పెరుగుతోంది. ఈ ఏడాది జపనీస్ యెన్‌‌ మారకంలో డాలర్ విలువ 22 శాతం పెరిగింది. యూరో మారకంలో 13 శాతం,  ఇండియన్ రూపాయి మారకంలో 8 శాతం లాభపడింది.  కొన్ని నెలల్లోనే డాలర్ వాల్యూ రికార్డ్‌‌ లెవెల్స్‌‌కు చేరుకుంది. గ్లోబల్‌‌గా ఆరు మేజర్ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ విలువ కొలిచే డాలర్ ఇండెక్స్ 20 ఏళ్ల గరిష్టమైన 114.78 ని టచ్ చేసింది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత గ్లోబల్‌‌గా ఇన్‌‌ఫ్లేషన్ పెరిగింది. ముఖ్యంగా యూరప్ ఎకానమీ అద్వాన్నంగా మారింది. మరోవైపు యూఎస్ ఫెడ్‌ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతోంది. దీంతో  అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి, అలానే అభివృద్ధి చెందిన దేశాల నుంచి కూడా విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు డాలర్‌‌‌‌లోకి వెళుతున్నాయి. గ్లోబల్‌‌ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందనే భయాలు పెరగడంతో డాలర్‌‌‌‌ను సేఫ్‌‌ అసెట్‌‌గా ఇన్వెస్టర్లు  చూస్తున్నారు. ‘ రేట్ల పెంపు వేగంగా జరుగుతుండడంతో డాలర్ ఇండెక్స్‌‌ 20 ఏళ్ల గరిష్టంలో స్ట్రాంగ్‌‌గా ఉంది. దీంతో దేశ డాలర్ మారకంలో రూపాయి విలువ పడుతోంది’ అని  ప్రభుదాస్ లీలాధర్ కరెన్సీస్‌‌ రీసెర్చ్ ఎనలిస్ట్ మేఘ్‌‌ మోడీ అన్నారు.  రూపాయి పతనాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్‌‌‌‌బీఐ ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల ఫారెక్స్ రిజర్వ్‌‌లను వాడిందని పేర్కొన్నారు. కేవలం కొన్ని నెలల్లోనే డాలర్ విలువ అమాంతం పెరగడం వివిధ దేశాల మాక్రో ఎకానమీపై ప్రభావం చూపుతోందని ఐఎంఎఫ్‌‌కు చెందిన గీతా గోపినాథ్‌‌, పియరీ ఆలివర్‌‌‌‌ గౌరించస్‌‌ తమ బ్లాగ్‌‌లో పేర్కొన్నారు.  గ్లోబల్‌‌ ట్రేడ్‌‌లో, ఫైనాన్స్ సెక్టార్‌‌‌‌లో డాలర్ ఆధిపత్యం  కొనసాగుతున్నందున డాలర్ వాల్యూలో మార్పులు దేశాల ఆర్థిక వ్యవస్థలపై డైరెక్ట్‌‌గా ప్రభావం చూపుతాయని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుండడంతో పాటు, గ్లోబల్‌‌ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో డాలర్ మరింత పెరుగుతుందని  ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ఆసియాలో ఇండోనేషియా రూపయ్‌‌, దేశ కరెన్సీల పెర్ఫార్మెన్స్ ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే మెరుగ్గా ఉందని బ్లూమ్‌‌బర్గ్ వెల్లడించింది.  డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 82.35 వద్ద సెటిలయ్యింది. దేశ ఎకానమీ ఫండమెంటల్‌‌గా బలంగా ఉందని, ఫారెక్స్ రిజర్వ్‌‌లు బాగున్నాయని  దేశ కరెన్సీని డిఫెండ్ చేస్తూ నిర్మలా సీతారామన్ ఐఎంఎఫ్‌‌ సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇన్‌‌ఫ్లేషన్ కూడా కంట్రోల్‌‌ చేయగలిగే స్థాయిలోనే ఉందని ఆమె అన్నారు. ఆర్‌‌‌‌బీఐ కూడా కరెన్సీ మార్కెట్‌‌లో వోలటాలిటీని తగ్గించడానికి 100 బిలియన్ డాలర్లు వాడిందని, డాలర్ మారకంలో రూపాయి లెవెల్‌‌ను సెట్ చేయడానికి కాదని వివరించారు.   రూపాయినే స్వతహాగా డాలర్ మారకంలో ఒక లెవెల్‌‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు.  దేశ ట్రేడ్ డెఫిసిటీ పెరుగుతున్నా, కేవలం ఒకే దేశంతో ట్రేడ్ డెఫిసిటీ పెరగకుండా చూస్తున్నామని ఆమె వివరించారు. 

మార్కెట్ జూమ్‌‌..

బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు సోమవారం సెషన్‌‌లో నష్టాల్లో ఓపెన్ అయినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో  లాభాల్లో ముగిశాయి. 30 షేర్లున్న సెన్సెక్స్  491 పాయింట్లు పెరిగి 58,411 వద్ద సెటిలయ్యింది. నిఫ్టీ 126 పాయింట్లు ఎగిసి 17,311 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌‌లో ఎస్‌‌బీఐ, బజాజ్ ఫిన్సర్వ్‌‌, యాక్సిస్ బ్యాంక్‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌, రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.  సెక్టార్ల పరంగా చూస్తే, నిఫ్టీ పీఎస్‌‌యూ బ్యాంక్‌‌, ప్రైవేట్ బ్యాంక్‌‌, ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌, ఆటో ఇండెక్స్‌‌లు పెరిగాయి. నిఫ్టీ  మిడ్‌‌క్యాప్‌‌50  0.70 శాతం లాభపడగా, స్మాల్‌‌క్యాప్ 50 మాత్రం 0.15 శాతం నష్టపోయింది. బీఎస్‌‌ఈ కంపెనీల మార్కెట్‌‌ క్యాపిటలైజేషన్‌‌ రూ. 1.53 లక్షల కోట్లు పెరిగి రూ.271.81 లక్షల కోట్లకు చేరుకుంది. బ్రాడ్ మార్కెట్ మాత్రం నెగెటివ్‌‌లో క్లోజయ్యింది. సుమారు 1,922 షేర్లు నష్టపోగా, 1,612 షేర్లు లాభాల్లో ముగిశాయి. 167 షేర్ల వాల్యూలో ఎటువంటి మార్పులేదు. ‘గ్లోబల్‌‌ మార్కెట్‌‌లతో పాటే లోకల్ మార్కెట్‌‌లు నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. కానీ, ఐటీ, బ్యాంకు షేర్ల క్యూ2 రిజల్ట్స్ బాగుండడంతో దిగువ స్థాయిల్లో ఇండెక్స్‌‌లకు సపోర్ట్ లభించింది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు.