
ఎంసెట్‌లో ర్యాంకు రాలేదని..అప్పులు తీర్చలేక..లవ్ ఫెయిల్ అయ్యిందని..భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక..
ఇలా క్షణికావేశంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అలాంటివాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి, కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తోంది రోషిణి ట్రస్ట్. ‘రోషిణి’ వాళ్ల బాధలను అర్థం చేసుకుంటుంది. ఓదార్పునిస్తుంది. తోడుగా ఉన్నాననే భరోసా ఇస్తోంది. మానసిక స్థైర్యాన్ని నింపి, జీవితంపై కొత్త ఆశలు కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఇప్పటివరకు ఎన్నో ప్రాణాలని కాపాడింది.
హైదరాబాద్‌లోని రోషిణి స్వచ్ఛంద సంస్థ 28 ఏండ్లుగా ఆత్మహత్యల నివారణ కోసం కృషి చేస్తోంది. ఈ ట్రస్ట్‌ని 1997లో ప్రారంభించారు. ఒక హెల్ప్ లైన్‌తో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు నాలుగు ఉచిత హెల్ప్‌లైన్ నెంబర్ల ద్వారా సర్వీసులు అందిస్తోంది. వాటికి ఫోన్ చేసి, వాలంటీర్లతో బాధను పంచుకుంటే ఎలాంటివాళ్లకైనా మనసు తేలికపడుతుంది. ఎంతో ఉపశమనం కలుగుతుంది. సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకటానికి కావలసిన మానసిక స్థైర్యం, ధైర్యం వస్తాయి. రోషిణి సంస్థ గురించి వివరిస్తూ.. ఆ సంస్థ మాజీ డైరెక్టర్, సీనియర్ వాలంటీర్ ఉషశ్రీ ఇలా చెప్పుకొచ్చారు.
ఆత్మహత్య పరిష్కారం కాదు
తాత్కాలిక సమస్యకు ఆత్మహత్య శాశ్వత పరిష్కారం కాదు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవాళ్లకు రోషిణి ట్రస్ట్ ద్వారా చేయూతనిస్తున్నాం. ట్రస్ట్‌కి రోజుకి 30 నుంచి 40 కాల్స్ వస్తాయి. అందులో ముగ్గురు నలుగురు తీవ్రమైన ఆత్మహత్య ధోరణితో ఉంటారు. అలాంటి వాళ్లతో మాట్లాడి ప్రాణాపాయ స్థితి నుంచి సాధారణ పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ‘రోషిణి’. మా వాలంటీర్లు సానుభూతితో సమస్యలను అర్థం చేసుకుని, అవసరమైన భరోసా ఇచ్చి, సమస్యల ఊబి నుంచి బయటకు లాగి జీవితం మీద ఆశ కల్పించి, ఒక నూతన జీవితాన్ని ప్రసాదించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
కొత్త ఆశలు చిగురించేలా..
రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌లో అర్హత కలిగిన సైకియాట్రిస్ట్‌లు, క్లినికల్ సైకాలజిస్టులు, కౌన్సెలర్లు, కెరీర్ కౌన్సెలర్లు పనిచేస్తున్నారు. వాళ్లు వ్యక్తిగత, పని ఒత్తిడి తగ్గేలా చేయడంలో ఎక్స్‌పర్ట్స్. అయితే.. కొన్ని సమస్యలను కేవలం ఫోన్‌లో మాట్లాడడం ద్వారా పరిష్కరించలేం. అందుకే రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నాం.
స్కూళ్లు, కాలేజీ, యూనివర్సిటీలకు వెళ్ళి ట్రస్ట్ గురించి చెప్పి, ఫోన్ నెంబర్స్ ఇచ్చి, సర్వీసెస్ గురించి వివరిస్తుంటాం. హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, జువినైల్ హెూమ్స్, జైళ్లు, చైల్డ్ డిటెన్షన్ సెంటర్లకు వెళ్లి రెగ్యులర్‌గా కౌన్సెలింగ్‌లు ఇస్తున్నాం. రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాం. అందుకే వాలంటీర్స్ అలాంటి వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటారు. వాళ్లలో ధైర్యాన్ని నింపి, మీకు తోడుగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఐటీ ఉద్యోగుల కోసం అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం.
స్టూడెంట్స్ కోసం ట్రస్ట్ ద్వారా నెలకు 6 సార్లు/రోజులు రామకృష్ణామఠ్, బల్కంపేట సాయిబాబా గుడి దగ్గర, మెహిదీపట్నంలో ఉచితంగా సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్, మందులు ఇస్తున్నాం. మానసిక సమస్యలతో బాధపడుతున్నవాళ్లకు ట్రస్ట్‌లో వారానికి నాలుగు సార్లు ఉచితంగా క్లినికల్ సైకాలజిస్టులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నెలకు రెండుసార్లు చర్లపల్లి జైలుకి వెళ్లి ఖైదీలతో మాట్లాడి వాళ్ల మనసులోని భావాలను, బాధను, భయాన్ని వింటాం. కొందరు మా కౌన్సెలింగ్ తర్వాత ఒక కొత్త జీవితానికి నాంది పలికి భవిష్యత్తు మీద ఆశతో ముందడుగు వేస్తున్నారు. అంతేకాదు.. ‘రోషిణి’ని సంప్రదించిన వాళ్లకు వాళ్ల సమస్యను బట్టి కావలసిన వివరాలు, కాంటాక్ట్స్ కూడా ఇస్తుంటాం.
ఎక్కువగా వాళ్లే..
ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు ఎక్కువగా 15–25, 45–60 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లలో కనిపిస్తుంటాయి. కొందరు తమలోని బాధని వ్యక్తపరచడానికి బలవన్మరణానికి ప్రయత్నిస్తారు. కానీ.. వాళ్లు నిజంగా చనిపోవాలి అనుకోరు. కొందరేమో నిజంగానే ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకొందరు కోపంతోనో, సహనం నశించో క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకుంటారు.
జన్యు పరంగా..
కొందరికి ఎలాంటి సమస్యలు లేకపోయినా జన్యుపరమైన కారణాల వల్ల డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. మెదడులో సెరటోనిన్ లెవల్స్ తగ్గడం వల్ల, స్కిజోఫ్రినియా అనే మానసిక సమస్య వల్ల డిప్రెషన్ పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.
ఎలా గుర్తించాలి?
బలన్మరణానికి పాల్పడే వాళ్లు ముందుగా కొన్ని సంకేతాలు ఇస్తారు. వాళ్లలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆకలి, నిద్ర ఉండదు. దేనిమీదా పెద్దగా ఆసక్తి ఉండదు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు దిగులుగా, అలసటగా, నీరసంగా కనిపిస్తారు. ఆత్మహత్య చేసుకోవడానికి కావాల్సినవాటిని అంటే నిద్రమాత్రలు, ఉరితాడు, కత్తి లాంటివి రెడీ చేసుకుంటారు. తమకు ఇష్టమైన వస్తువులను నచ్చినవాళ్లకు ఇచ్చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలను కుటుంబసభ్యులు, స్నేహితులు లేదా ఎవరికి వాళ్లే స్వయంగా గుర్తించినా రోషిణి లాంటి సంస్థలను సంప్రదిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు.
ఎలా ఆలోచిస్తారు?
ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయంటే.. ‘‘తాము చనిపోతే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబమంతా హాయిగా ఉంటుంది” అనుకుంటారు. కానీ.. పిల్లల మరణం వల్ల తల్లిదండ్రులకు కలిగే బాధ వాళ్లను జీవితాంతం వేధిస్తుంది. కాబట్టి క్షణికావేశంలో ప్రాణాలను పోగొట్టుకుని కుటుంబానికి క్షోభ మిగల్చడం కరెక్ట్ కాదు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవాళ్లలో ఒక్క మాట బతుకుపై ఆశ కలిగిస్తుంది. చిన్న ఓదార్పు జీవితంపై మమకారాన్ని పెంచుతుంది. నేనున్నానని ఇచ్చే సపోర్ట్ సమస్యలను ఎదుర్కొని నిలబడగలిగే శక్తిని ఇస్తుంది. అవన్నీ ఇవ్వడానికే రోషిణి సంస్థ నిరంతరం కృషి చేస్తోంది.
పరీక్షల భయం
మాకు పరీక్షల ముందు స్టూడెంట్స్ నుంచి ఎక్కువగా కాల్స్ వస్తుంటాయి. పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవుతామో లేదో, ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? ఫ్రెండ్స్ ముందు ఎలా తలెత్తుకోవాలి? అనే ఆందోళనల వల్ల ఒత్తిడికి గురవుతారు. మేం వాళ్ల అపోహలు, సందేహాలను నివృత్తి చేస్తాం. బిఫ్రెండింగ్ అనే ప్రాసెస్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తుంటాం.
లవ్ ఫెయిల్
కొందరు లవ్ ఫెయిల్ కావడంతో విపరీతంగా బాధపడతారు. బతికి ఉండడం అవసరమా? అనుకుంటారు. ఇలాంటి సమస్యలను ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చెప్పుకోలేరు. అందుకే మాకు ఫోన్ చేస్తుంటారు. మేం ఆ విషయాలను చాలా గోప్యంగా ఉంచుతాం. వాళ్ల పేరెంట్స్ అడిగినా చెప్పము. ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో వివరంగా చెప్తాం. దాంతో వాళ్లు జీవితంలో ఇలాంటి ఆటుపోట్లు సహజమే అని అర్థం చేసుకుంటారు.
బెట్టింగ్స్
ఒకబ్బాయి చదువుకోవడానికి పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాడు. ఫ్రెండ్స్ వల్ల మందు, డ్రగ్స్‌కి అలవాటుపడ్డాడు. ఆ తర్వాత బెట్టింగ్ ఊబిలోపడి అప్పులపాలయ్యాడు. దాంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్ మీదకు వెళ్లాడు. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అతని ఫ్రెండ్ ఎవరో ‘రోషిణి’ గురించి చెప్పింది గుర్తొచ్చి, మాకు ఫోన్ చేశాడు. మా వాలంటీర్స్ అతనికి కౌన్సెలింగ్ ఇచ్చాక రియలైజ్ అయ్యి ‘‘నేను చనిపోతే నా తల్లిదండ్రులు బాధపడతారు. నా సమస్యలను ఎదిరించి పోరాడతా” అని చెప్పి వెళ్లిపోయాడు. నాలుగు నెలల తర్వాత మళ్లీ ఫోన్ చేసి ‘ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాన’ని చెప్పాడు.
ఇలా మొదలైంది
రోషిణి ట్రస్ట్ సికింద్రాబాద్‌లోని సింధి కాలనీలో ఉంది. దీన్ని 1997లో ఏర్పాటు చేశారు. సిటీలో జరుగుతున్న ఆత్మహత్యలను చూసి తట్టుకోలేక కొంతమంది స్నేహితులు శశిరెడ్డి, బి. శ్రీకాంత్, శాంతి కృష్ణమూర్తి, పూనమ్ పమ్నాని కలిసి ‘రోషిణి’ని స్థాపించారు. 28 సంవత్సరాలుగా అనుభవజ్ఞులైన, శిక్షణ పొందిన వాలంటీర్లతో ఇది నడుస్తోంది. ప్రస్తుతం ఇందులో 70 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఈ మధ్యే ‘సైకియాట్రీ ఎట్ యువర్ డోర్‌స్టెప్ సర్వీస్’ని కూడా ప్రారంభించారు.
టేబుల్ టాక్స్ యాక్టివిటీ
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోవ్సవం సందర్భంగా రోషిణి ట్రస్ట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈసారి కూడా ‘టేబుల్ టాక్స్ యాక్టివిటీ’ పేరుతో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది మరో రెండు నెలలు కొనసాగుతుంది. ఇందులో భాగంగా కొన్ని కేఫెలతో టై అప్ అయ్యి, అక్కడికి వచ్చే యువతతో ఇంటరాక్ట్ అవుతున్నాం.
►ALSO READ | ఈ స్టెతస్కోప్ గుండె జబ్బులను గుర్తిస్తది.!
చిన్న చిన్న గేమ్స్, క్విజ్‌ల ద్వారా వాళ్లను ఎంటర్‌టైన్ చేస్తూ.. వాళ్లు ఫీలింగ్స్, ఎమోషన్స్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారో తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా ఈనెల 10న ‘సెప్టెంబర్ 10’ పేరుతో తీసిన ఒక సినిమాని ఎల్‌వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో స్క్రీన్ చేస్తున్నాం. రిటైర్ట్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ క్యాప్టెన్ జీ.జే. రావు ‘సెప్టెంబర్ 10’ పేరుతో రాసిన ఒక పుస్తకం ఆధారంగా డైరెక్టర్, ప్రొడ్యూసర్ సాయి ప్రకాశ్ ఈ సినిమా తీశారు. అదే రోజు ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించేందుకు ‘క్యాండిల్ లైట్ విజిల్’ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం.
కారణాలేంటి?
ఒంటరితనం, పరీక్షల్లో ఫెయిల్ కావడం, ఉద్యోగం పోవడం, లవ్ ఫెయిల్, కుటుంబ తగాదాలు, ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు, అన్యోన్యత దెబ్బతినడం, డ్రగ్స్‌కు అలవాటు పడడం, దీర్ఘకాల జబ్బులతో బాధపడుతుండడం, వృద్ధాప్యాన్ని భారంగా భావించడం.. ఇలాంటి కారణాల వల్ల కొందరు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. దానివల్ల డిప్రెషన్‌లోకి వెళ్లి, నిరాశ నిస్పృహలకు లోనవుతారు. తాము దేనికీ పనిరామని నిర్ణయించుకుంటారు. భవిష్యత్తు మీద ఆశలు వదులుకుంటారు. సమస్య తీవ్రమవుతున్న కొద్దీ తాము బతికి ప్రయోజనం లేదనే ఆలోచన మనసును తొలిచేస్తుంది. అప్పుడే ఆత్మహత్యకు పాల్పడుతుంటారు.
ఎలా సంప్రదించాలి?
ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కౌన్సెలింగ్ కోసం కాల్ చేసి మాట్లాడొచ్చు. లేదంటే సెంటర్‌కి వెళ్లి కలవొచ్చు.
ఫోన్ నెంబర్లు : 04 066202000, 81420 20033 , 040 66202001, 81420 20044
Website : https://roshinitrust.com/
ఫేస్‌బుక్: https://www.facebook.com/share/14Dav1RfXv3/
ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/roshini_trust
కుటుంబ సమస్యలు
నేటి సమాజంలో భార్యా-భర్తలు, తల్లిదండ్రులు-పిల్లల మధ్య బంధాలు దెబ్బతింటున్నాయి. ఇంట్లో ఒకరితో ఒకరు పెద్దగా మాట్లాడుకోరు. ఎప్పుడూ ఫోన్లతోనే బిజీగా ఉంటారు. దాంతో దూరం పెరుగుతోంది. సంతోషం, బాధను ఒకరితో ఒకరు షేర్ చేసుకోకుండా సమస్య వచ్చినప్పుడు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు. ఇలాంటివాళ్లకు మేం కౌన్సెలింగ్ ఇచ్చి, సమస్యల నుంచి బయటపడేస్తాం. ఒకసారి ‘రోషిణి’కి ఒక తల్లి, కూతురు వచ్చారు. తల్లి ‘నా కూతురి సంతోషం కోసం పార్టీలకు వెళ్లినా, ఎలాంటి బట్టలు వేసుకున్నా అడ్డు చెప్పలేదు’ అన్నది. కూతురేమో ‘పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవడం లేదు. అన్నింటికీ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నార’ని బాధ పడింది. ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి గైడ్ చేశాం.
ఉషశ్రీ ,రోషిణి సంస్థ మాజీ డైరెక్టర్, సీనియర్ వాలంటీర్