ఓట్లు మావే.. సీట్లూ మావే.. ఎవరు ఎక్కువ సీట్లిస్తే వారికే మా ఓటు

ఓట్లు మావే.. సీట్లూ మావే.. ఎవరు ఎక్కువ సీట్లిస్తే వారికే మా ఓటు
  • ఓట్లు మావే.. సీట్లూ మావే..
  • ఎవరు ఎక్కువ సీట్లిస్తే వారికే మా ఓటు
  • ముదిరాజ్​ల ఆత్మగౌరవ సభలో వక్తలు
  • బీసీ(డి) నుంచి బీసీ(ఏ)లో చేర్చాలి
  • బానిస బతుకులకు స్వస్తి పలికి.. పిడికిలి ఎత్తాలి
  • బడ్జెట్​లో రూ.20వేల కోట్లు కేటాయించాలని డిమాండ్

సికింద్రాబాద్, వెలుగు : రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్​లను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పలువురు వక్తలు మండిపడ్డారు. బీసీ(డి) నుంచి బీసీ (ఏ)లోకి మార్చాలని పోరాటాలు చేసినా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. ఓట్లు మావే.. సీట్లు మావే.. అనే నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఇక బానిస బతుకులకు స్వస్తి పలికి.. పిడికిలి ఎత్తి పోరాడాలని కోరారు. రాజకీయ రంగంలో ముదిరాజ్​లను బీఆర్ఎస్ అణగదొక్కిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనాభాలో 11 శాతం ముదిరాజ్​లు ఉన్నారన్నారు. బడ్జెట్​లో కూడా అన్యాయం చేస్తున్నదని వక్తలు మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్​లో రూ.20వేల కోట్లు కేటాయించాల్సింది పోయి.. చేప పిల్లల పేరుతో ఇచ్చేది రూ.500 కోట్లే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో ఆదివారం ముదిరాజ్​ల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ముదిరాజ్​ల ఆత్మగౌరవ సభ కమిటీ కార్యదర్శి శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ముదిరాజ్​లు భారీగా తరలివచ్చారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే ముదిరాజ్​లకు ఎక్కువ సీట్లు కేటాయిస్తుందో దానికే ఓటు వేస్తారన్నారు. ముదిరాజ్​లను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదన్నారు. బీసీ(డీ) నుంచి బీసీ(ఏ)లోకి మార్చాలని తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కొట్లాడుతున్నానని తెలిపారు. ‘‘వైఎస్సార్.. 2008 జడ్చర్ల సభలో ముదిరాజ్​లను బీసీ(డీ) నుంచి బీసీ(ఏ)కు మారుస్తా అని ప్రకటించారు. అదే సభలో, మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అనౌన్స్​ చేశారు. అయితే, ముదిరాజ్​లకు బీసీ(ఏ) రిజర్వేషన్ ఫలాలు ఏడాది మాత్రమే అందాయి. రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టుకు వెళ్లింది. మైనారిటీలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండటంతో వారు గెలిచారు. మనల్ని ఎవరూ పట్టించుకోలేదు’’ అని ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్​లో ఎంతో మంది ముదిరాజ్​లు ఉన్నారని, కష్టపడి పనిచేస్తున్న వారికి టికెట్లు ఎందుకివ్వడం లేదని కేసీఆర్​ను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ప్రతి మత్స్యకారుడికీ సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టేట్ కేబినెట్​లో 18 మంది మంత్రులుంటే.. అందులో ఒక శాతం జనాభా ఉన్న ఒకే సామాజిక వర్గానికి ఐదుగురు కేబినెట్ హోదాలో కొనసాగుతున్నారన్నారు. ఒక శాతం జనాభాకు ఐదుగురు మంత్రులుంటే.. 52 శాతం జనాభా ఉన్న బీసీలకు మూడు మంత్రి పదువులు ఇచ్చి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇంకా తమ సహనాన్ని, ఓపికను పరీక్షించొద్దని, పిల్లిని గదిలో పెట్టి కొడితే అది కూడా తిరగబడుతుందని అన్నారు. ఇప్పుడు ముదిరాజ్​లు చేస్తున్నదీ అదే అని ఈటల చెప్పారు. 

అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారు: రమేశ్ ముదిరాజ్

భూపాలపల్లి నుంచి వచ్చిన ముదిరాజ్ సంఘం నేత డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్​లకు కేసీఆర్ ఒక్క ఎమ్మెల్సీ సీటు ఇచ్చి.. తమ ఓట్లు గుంజుకోవడానికి చూస్తున్నారని అన్నారు. ఎవరు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇస్తే.. ఆ పార్టీకే ఓటేస్తామని ప్రకటించారు. టీజేఎస్ లీడర్ నిజ్జన రమేశ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. స్టూడెంట్లు మొదలుకొని అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ముదిరాజ్​లు వ్యూహాత్మకంగా ఆలోచించాలని, మన ఓట్లు మన లీడర్లకే వేసుకుని గెలిపించుకోవాలని పిలు పునిచ్చారు. మహబూబ్​నగర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేస్తున్న చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడారు. ముదిరాజ్​లను బీసీ(-డీ) నుంచి బీసీ(-ఏ)లోకి మారుస్తామని హామీ ఇచ్చే పార్టీలకే ఓటు వేయాలన్నారు. ముదిరాజ్​లకు ఎన్ని సీట్లు ఇస్తారో స్పష్టం చేయాలని అన్ని పార్టీలను డిమాండ్ చేశారు.

చీమల దండు కదిలింది: చంద్రశేఖర్ ముదిరాజ్

మాజీ మంత్రి చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి దాకా అణిగిమణిగి చీమల్లా ఉన్న మనల్ని కేసీఆర్ కావాలని గోకిండు. ఈ చీమలకు కోపమొచ్చింది. ఎప్పుడు, ఎవరిని కుడతాయో ఇక చూడండి.. కేసీఆర్ అడ్డమొస్తే.. ఆయన్ని కుడుతాయ్.. చీమల దండు లేచింది”అని ధ్వజమెత్తారు. ఈ సభ చూసి బీఆర్ఎస్ లీడర్లలో దడ పుట్టిందని విమర్శించారు. జ్యోతిరావు పూలే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా 18 మంది ముదిరాజ్ బిడ్డలను గెలిపించుకుని అసెంబ్లీకి పంపాలన్నారు.