బొగ్గు రవాణాలో స్పీడ్​ కోసం 240 ప్యాసింజర్​ రైళ్లు రద్దు

బొగ్గు రవాణాలో స్పీడ్​ కోసం 240 ప్యాసింజర్​ రైళ్లు రద్దు
  • పవర్ ప్లాంట్లలో తగ్గిన బొగ్గు నిల్వలు
  • విద్యుత్ సంక్షోభంలో ఢిల్లీ

న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభంలోనికి వెళ్లిపోతున్నాయి. పవర్ ప్లాంట్ల వద్ద నిల్వలు అడుగంటిపోవడంతో ఏ క్షణంలో అయినా 'బ్లాక్ అవుట్' ఏర్పడే అవకాశం ఉన్నది. దీంతో బొగ్గును థర్మల్ ప్లాంట్లకు వేగంగా చేరవేసేందుకు వీలుగా దేశవ్యాప్తంగా 240 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. బొగ్గును రవాణా చేస్తున్న 400 రాక్స్ ఎలాంటి ఆటంకంలేకుండా, విద్యుత్ ప్లాంట్లకు వేగంగా చేర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కిందటేడాది 347 కోల్ రాక్స్ నడిపామని.. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య 400కు చేరినట్లు పేర్కొంది. మరోవైపు, ఢిల్లీకి 'బ్లాక్ అవుట్' ప్రమాదం పొంచి ఉందని ఆ రాష్ట్ర పవర్ మినిస్టర్ సత్యేందర్ జైన్ చెప్పారు. పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకునేలోపే బొగ్గు సప్లయ్ చేయకపోతే ఢిల్లీలో మెట్రో, హాస్పిటల్స్ కు కూడా కరెంట్​ సప్లై నిలిచిపోయే ముప్పు ఉందన్నారు. 

దాద్రి, ఉంచహార్ ప్లాంట్లలో ఒక రోజు నిల్వలే..
ఢిల్లీకి సరఫరా అయ్యే విద్యుత్ లో ఎక్కువ భాగం దాద్రి, ఉంచహార్ లోని ఎన్టీపీసీ ప్లాంట్ల నుంచే వస్తుంది. అయితే ఈ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు కేవలం ఒక రోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని సత్యేంద్ర జైన్ తెలిపారు. సరైన సమయానికి బొగ్గు సరఫరా కాకుంటే.. దేశ రాజధాని చీకట్లోకి వెళ్లిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మేం ఎలాంటి బకాయిలు పడలేదు.. కానీ కేంద్రం బొగ్గు రాక్స్ ను పెంచకుండా సప్లై బాగా ఆలస్యం చేసింది. అందుకే నిల్వలు తగ్గిపోయాయని ఆయన ఆరోపించారు. 

రైళ్ల రద్దు తాత్కాలికమే..
దేశవ్యాప్తంగా రద్దు చేసిన రైళ్లను త్వరలోనే మళ్లీ నడిపిస్తామని ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ కృష్ణ బన్సాల్ చెప్పారు.