- మండుతున్న ఎండలు.. కానరాని చలివేంద్రాలు
- పలు పనులపై పట్టణ కేంద్రాలకు, బస్తాండ్లకు వచ్చేవాళ్లకు నీళ్ల కరువు
- పైసలు పెట్టి కొంటే తప్ప దొరకని నీళ్లు
- మున్సిపాలిటీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ ఆదేశాలు
- అయినా పట్టించుకోని అధికారులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 39 డిగ్రీల నుంచి 42.8 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మండుతున్న ఎండలకు తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక పట్టణానికి వచ్చే ప్రజలు గోస పడుతున్నారు. పైసలు పెట్టి కొంటే తప్ప చుక్క నీరు దొరకని దుస్థితి నెలకొంది. మున్సిపాలిటీల్లో వెంటనే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పలుమార్లు కలెక్టర్ఆదేశించినా అధికారులు మాత్రం ఇప్పటికీ తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బంది తప్పడం లేదు.
బస్టాండ్, హాస్పిటళ్లోనూ నీళ్లు దొరకట్లే..
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బస్టాండ్‌తో పాటు ఇల్లెందు, పాల్వంచ బస్టాండ్లలో తాగు నీటి సౌకర్యం లేక ప్రయాణికులతో పాటు డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. బస్టాండ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రతి టికెట్‌పై రూ. 1 చొప్పున ఆర్టీసీ వసూలు చేస్తోంది. కానీ ఆర్టీసీ ఆఫీసర్లు మాత్రం వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వీడడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్లలో మంచినీళ్లు కావాలంటే కొనుక్కోవాల్సిందే. కొత్తగూడెం బస్టాండ్‌లో దాతలు ఇచ్చిన కూల్ వాటర్ ఫ్రిజ్పనిచేయడం లేదు. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది కోసం దాతలు ఇచ్చిన ఆర్వో ప్లాంట్‌ను కూడా మెయింటెనెన్స్చేయని దుస్థితిపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలోని జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో తాగు నీటి కోసం పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు కావాలంటే సెకండ్ ఫ్లోర్ నుంచి పేషెంట్లు, వారి సహాయకులు గ్రౌండ్ ఫ్లోర్ వరకు నడుచుకుంటూ రావాల్సిందే. రామవరంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రంలోనూతాగు నీటికి తిప్పలు తప్పడం లేదు.
కనిపించని చలివేంద్రాలు..
పట్టణ కేంద్రాలకు వివిధ పనులపై చుట్టుపక్కల గ్రామాల నుంచి రోజూ వేల సంఖ్యలో ప్రజలు వచ్చిపోతుంటారు. అటు బస్టాండ్, హాస్పిటళ్లలోనూ సరిగా నీళ్లు లేక, ఇటు ఎండాకాలంలో ఏర్పాటు చేసే చలివేంద్రాలు లేక తాగునీటికి తండ్లాడుతున్నామని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. ఎండలు మండతున్నా అధికారులు మాత్రం ఇప్పటి వరకు తాగునీటి ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం సరికాదంటున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే పట్టణ కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
వెంటనే ఏర్పాటు చేస్తాం
కొత్తగూడెం మున్సిపాలిటీలో ఎనిమిది చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశాం. ఇటీవల ఎండలు ఎక్కువయ్యాయి. వెంటనే చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు చూపడుతాం.
శేషాంజనేయస్వామి, మున్సిపల్కమిషనర్, కొత్తగూడెం