
- ..వీరిలో 136 మంది మహిళలే
- జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపు
భద్రాచలం, వెలుగు: ఏడాది కాలంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో 357 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారని, వారిలో 136 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ధ్రువీకరించింది. జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం 24 పేజీలతో కూడిన ప్రకటనను ఇంగ్లిష్, గోండు భాషల్లో రిలీజ్ చేసింది. దండకారణ్యంలోనే అతి పెద్ద నష్టం జరిగిందని, 281 మంది చనిపోవడం పట్ల విచారం వ్యక్తం చేసింది.
నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 23 మంది జిల్లా కమిటీ సభ్యులు, 17 మంది పీఎల్జీఏ మెంబర్స్ ఉన్నట్లు తెలిపారు. బీహార్, జార్ఖండ్లో 14 మంది, తెలంగాణలో 23 మంది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 8 మంది, ఆంధ్రా-, ఒడిశా బార్డర్లో 9 మంది, ఒడిశాలో 20 మంది, పంజాబ్లో ఒకరు, ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఒకరు చనిపోయినట్లు లేఖలో వెల్లడించింది. ఆపరేషన్ కగార్ వల్ల పరిస్థితి దారుణంగా మారిందని, కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం దాడులు చేయడం వల్ల లొంగుబాట్లు, అరెస్ట్ లు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ చీఫ్ బసవరాజ్ అలియాస్ నంబాల కేశవరావు, చలపతి, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, శర్మ, గౌతమ్ అలియాస్ తెంటు లక్ష్మీనర్సింహం, మధు అలియాస్ సజ్జా వెంకట నాగేశ్వరరావు, రూపేశ్, నీతి, కార్తీక్, చైతీ అలియాస్ రేణుక, గుడ్డు, శ్యాం, అలోక్, పాపన్న, మధు, భాస్కర్ అలియాస్ అదెల్లు, జగన్ అలియాస్ పండన్న, అరుణ, జయ వంటి నేతలను కోల్పోయామని ఆ లేఖలో పేర్కొన్నారు.
వెలిసిన వాల్ పోస్టర్లు..
మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజాఫంట్ పేరిట మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గుబ్బలమంగి వాగు బ్రిడ్జి సమీపంలో, పెద్దబండిరేవు, ములకనాపల్లి, పులిగుండాల, ములకపాడు గ్రామాల్లో వాల్పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. చెట్లకు వాల్పోస్టర్లు కట్టగా, కరపత్రాలను రోడ్లపై వదిలారు. ‘సిద్ధాంతం కోసం అడవిపాలైన అన్నలారా, అక్కలారా మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యుడికి ఆశాకిరణం ఎక్కడైంది? మీకు ఎదురైన సవాళ్లు, తద్వారా వచ్చే పరిణామాలు విశ్లేషిస్తే మీకు ఆత్మసంతృప్తిని మిగిల్చిందేంది? ఆత్మ సంతృప్తి లేని ఆత్మగౌరవంతో ముందుకు పోతున్న మీ 40 ఏండ్ల నాటి ఉద్యమబాట ప్రజాదరణ లేక మోడువారిన బీడు భూమిలా అయ్యింది’ అని అందులో పేర్కొన్నారు.
ఇకనైనా మీ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని వీడి, కాలనుగుణంగా మారిన ప్రజల జీవన విధానంలో పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ‘అడవిని వీడి ప్రజల్లోకి రండి, ప్రజాస్వామ్య గొంతుక కండి, ఆయుధాలు మనకొద్దు, ప్రజామోద మార్గమే మనకు ముద్దు, జనజీవన స్రవంతిలోకి రండి, మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి’ అంటూ సూచించారు. ఈ పోస్టర్లు ఏజన్సీలో వెలవడం కలకలం రేపుతోంది.