హిడ్మా బతికే ఉన్నడు : మావోయిస్ట్ పార్టీ

హిడ్మా బతికే ఉన్నడు : మావోయిస్ట్ పార్టీ

ఛత్తీస్ఘడ్ లోని బస్తర్ ఆటవీ ప్రాంతంలో జరిగిన భద్రతా బలగాల దాడిపై మావోయిస్ట్ పార్టీ మరో లేఖ విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఈ లెటర్ విడుదలైంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణ వార్తను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. బస్తర్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో భద్రతా బలగాలు అనుకునట్లుగా ఏమి జరగలేదని లేఖలో పేర్కొంది. భద్రతా బలగాల దాడులను మావోయిస్టులు తిప్పికొట్టారని చెప్పింది.

అనవసరపు దాడులతో ఆదివాసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది. దేశ రక్షణ కోసం ఉండాల్సిన భద్రత బలగాలను ఛత్తీస్ఘడ్ ఆటవీ ప్రాంతంలో మొహరిస్తున్నారని చెప్పింది.  దేశంలో ఎక్కడాలేని విలువైన సంపద ఛత్తీస్ఘడ్ ఆటవీ ప్రాంతలో ఉందని.. ఈ విలువైన సంపదను దోచుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించింది. ఆదివాసీలకు చెందాల్సిన సంపదకు మావోయిస్టు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేసింది. ఛత్తీస్ఘడ్ రాష్ట్రాన్ని పోలీస్  క్యాంప్గామార్చేశారని..  ఏకంగా వైమానిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడింది.