12 ఏండ్ల అజ్ఞాతం నుంచి మృత్యుఒడికి... చత్తీస్​గఢ్​ ఎన్ కౌంటర్​లో కన్నుమూసిన విజయలక్ష్మి

12 ఏండ్ల అజ్ఞాతం నుంచి మృత్యుఒడికి... చత్తీస్​గఢ్​ ఎన్ కౌంటర్​లో  కన్నుమూసిన విజయలక్ష్మి
  • సొంతూరు వేముల నర్వ

షాద్ నగర్, వెలుగు: ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లిన యువతి అక్కడి నుంచే ఉద్యమబాట పట్టింది. 12 ఏండ్లుగా అజ్ఞాతంలోనే ఉండి, చివరకు చత్తీస్​గఢ్​ జరిగిన ఎన్ కౌంటర్ లో కన్నుమూసింది. ఆమే రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన వన్నాడ విజయలక్ష్మి అలియాస్ భూమిక. వన్నాడ సాయిలు గౌడ్ మొదటి భార్య రాధమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. వీరిలో విజయలక్ష్మి మూడో సంతానం. 

ఈమె పుట్టిన ఏడాదికే పాము కాటుతో తల్లి మృతి చెందింది. విజయలక్ష్మి కేశంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి వరకు చదివింది. అనంతరం అక్కడే ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. డిగ్రీ మహబూబ్ నగర్​లోని ఎన్టీఆర్ మహిళా ప్రభుత్వ కళాశాలలో చదివింది. నిజాం కళాశాలలో ఎల్ఎల్​బీ చేస్తున్న సమయంలో ఉద్యమాలకు ఆకర్షితురాలైంది. కుటుంబ బంధాలను తెంచుకొని, అడవుల్లోకి వెళ్లింది.  

ఆ తర్వాత విజయలక్ష్మితో ఎప్పుడూ మాట్లాడలేదని, ఆమె గ్రామంలోకి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. చదువుకుంటున్న సమయంలో గ్రామంలో చిన్న పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెప్పిందని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు.