గ్రామాల్లో కార్డన్ సెర్చ్లు ముమ్మరం

గ్రామాల్లో కార్డన్ సెర్చ్లు ముమ్మరం

భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల సరిహద్దు అడవులలో మావోయిస్టు కదలికలు ఉన్నాయన్న సమాచారంతో గుండాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఛత్తీస్ గఢ్  నుంచి మావోలు రాష్ట్రంలోకి వస్తున్నారన్న సమాచారంతో సరిహద్దుల్లో నిఘా పెంచారు. గుండాల సరిహద్దు గ్రామాల్లో ఉన్న మావోయిస్టు సానుభూతిపరులను అదుపులోకి తీసుకొని మావోయిస్టుల సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టు అగ్ర నాయకుల సమాచారం ఇచ్చినవారికి రూ.5 లక్షల నుంచి రూ. పది లక్షల వరకు పారితోషికం  ఇస్తామని గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్నారు. పోలీసు ఇన్ఫార్మర్ల వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు.

‘మాకు సమాచారం మీకు బహుమతులు’ నినాదంతో మావోయిస్టు నాయకుల ఫోటోలతో ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలను గ్రామ గ్రామాన పోలీసులు పంచుతున్నారు. మావోయిస్టులు గ్రామాలకు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. మావోయిస్టులకు ఆశ్రయమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు . మావోయిస్టు ఉద్యమాలకు ఆకర్షితులు కావద్దని యువకులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాలలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. గుండాల ప్రాంతంలో పోలీసుల హడావుడి ని చూసిన ప్రజలు ఏం జరుగుతుందోననే భయాందోళనకు గురి అవుతున్నారు.