దంతెవాడలో మావో పంజా : బీజేపీ ఎమ్మెల్యే సహా ఐదుగురు మృతి

దంతెవాడలో మావో పంజా : బీజేపీ ఎమ్మెల్యే సహా ఐదుగురు మృతి

చత్తీస్ గఢ్ రాష్ట్రం.. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడ ఎమ్మెల్యే, బీజేపీ నేత భీమ్ రామ్ మాండవి కాన్వాయ్ ను లక్ష్యంగా చేసుకుని భారీ పేలుడు జరిపారు. బ్లాస్ట్ జరిగిన తర్వాత.. కాన్వాయ్ పైకి కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే భీమా మాండవి, వాహనం డ్రైవర్, ముగ్గురు పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు చత్తీస్ గఢ్ పోలీస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్ లో చేర్చారు.

దంతెవాడలోని నాకులనార్ ప్రాంతంలో ఎమ్మెల్యే కాన్వాయ్ పై మావోయిస్టులు ఈ దాడి చేశారు. శక్తిమంతమైన IEDలను వాడి పేలుడు జరిపినట్టు అధికారులు గుర్తించారు. పేలుడు ధాటికి వారి శరీరాలు చిధ్రమయ్యాయని తెలిపారు.

సంఘటన స్థలాన్ని యాంటీ నక్సల్ ఆపరేషన్స్ డీఐజీ పి.సుందర్ రాజ్ సందర్శించారు. చాలా పవర్ ఫుల్ బ్లాస్ట్ జరిపారని ఆయన అన్నారు. శరీరాలను ఫోరెన్సిక్ డిపార్టుమెంట్ కు పంపించామని… పోస్టు మార్టమ్ తర్వాత బంధువులకు ఇస్తామని తెలిపారు.

ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతి

దంతెవాడలో జరిగిన మావో దాడిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచారం తెలిపారు. మావోయిస్టుల చర్యను తీవ్రంగా ఖండించారు. అమరులైన సెక్యూరిటీ సిబ్బందికి నివాళులు అర్పించారు. అమరుల త్యాగాలు వృధాగా పోవని మోడీ అన్నారు. చనిపోయిన ఎమ్మెల్యే భీమా మాండవి పార్టీలో అంకితభావంతో కార్యకర్తగా పనిచేశారని చెప్పారు. చత్తీస్ గఢ్ ప్రజలకు సేవ చేయాలని తపన పడ్డారని అన్నారు. “వారి కుటుంబానికి సంతాపం ప్రకటిస్తున్నా. ఓంశాంతి.” అన్నారు మోడీ.