
- కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ
- కార్పొరేట్ల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపణ
- ఆపరేషన్ కగార్ పేరుతో మారణకాండ సృష్టిస్తున్నారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: మావోయిస్టు పార్టీపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ అక్టోబర్ 24న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నట్టు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తెలిపారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మంగళవారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులను, పార్టీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని ఆరోపించారు.
ఇందుకు వ్యతిరేకంగా అక్టోబర్ 18 నుంచి 23 వరకు నిరసన వారాన్ని పాటించాలని ప్రజలను కోరారు. అక్టోబర్ 24న దేశవ్యాప్తంగా బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్‌కు నిరసనగా నారాయణ్ పుర్ జిల్లా మాడ్, బీజాపుర్ జిల్లా నేషనల్ పార్క్, కర్రెగుట్ట, సుక్మా జిల్లా, పశ్చిమ సింగ్ భుమ్ జిల్లా, ఒడిశాలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. గరియబంద్ జిల్లా బాలుడిగ్గీ పరిసర అటవీ ప్రాంతంలో సెప్టెంబర్ 11న పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలక్రిష్ణను, ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు చంద్రహాస్ తోపాటు10 మంది మావోయిస్టు పార్టీ సభ్యులను పట్టుకొని కాల్చి చంపారని ఆరోపించారు.
సెప్టెంబర్ 11 నుంచి 20వ తేదీ మధ్యలో కడారి సత్యనారాయణ రెడ్డి, కట్టా రామచంద్రారెడ్డిని రాయ్ పుర్, బిలాస్ పుర్ పట్టణాల్లో అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి సెప్టెంబర్ 22న చంపారన్నారు. సెప్టెంబర్ 12న దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు విజయ్, డివిజనల్ కమిటీ కార్యదర్శి లోకేశ్‌ను బూటకపు ఎన్ కౌంటర్ లో హత్యచేశారని, సెప్టెంబర్ 14న కేంద్ర కమిటీ సభ్యుడు సహదేవ్ సోరేన్, రఘునాథ్ తోపాటు మరో ఇద్దరిని హత్యచేశారని అని లేఖలో పేర్కొన్నారు. ఈ హత్యలకు నిరసనగా దేశవ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్టు వెల్లడించారు.