
- కర్రెగుట్టలను స్వాధీనం చేసుకొని జెండా ఎగురవేసిన బలగాలు
- తొమ్మిది రోజుల పాటు కూంబింగ్ చేసిన జవాన్లు
- మరోసారి తప్పించుకున్న హిడ్మా దళం
- ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి
భద్రాచలం, వెలుగు : తెలంగాణ, చత్తీస్‌గఢ్ బార్డర్‌లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. పది రోజుల కింద కర్రెగుట్టలను చుట్టుముట్టిన భద్రతాబలగాలు మావోయిస్టుల కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో పీఎల్‌జీఏ నంబర్ 1 బెటాలియన్‌కు చెందిన ముగ్గురు మహిళా మావోయిస్టులు చనిపోగా మిగతా వారు తప్పించుకున్నారు. ఇందులో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా దళం సైతం ఉన్నట్లు తెలుస్తోంది.
పది రోజుల కింద ప్రారంభమైన ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’
రెండు రాష్ట్రాల బార్డర్‌లో ఉన్న కర్రె గుట్టల చుట్టూ బాంబులు పెట్టామని, ఇటువైపు గిరిజనులు ఎవరూ రావొద్దని మావోయిస్టులు గతంలో ప్రకటించారు. దీంతో ఈ గుట్టల్లోని బంకర్లలో సుమారు వెయ్యి మంది మావోయిస్టులు ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం అందింది. అలర్ట్ అయిన బలగాలు ఏప్రిల్ 21న ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ పేరుతో కూంబింగ్ ప్రారంభించాయి. ఆపరేషన్‌లో భాగంగా దట్టమైన అడవులు, కొండలు, గుహలను జల్లెడ పట్టారు. తొలుత నీలంసారాయి గుట్టలు, జలపాతాలను ఆధీనంలోకి తీసుకున్న సీఆర్‌పీఎఫ్ బలగాలు తర్వాత దోబే గుట్టలను సైతం స్వాధీనం చేసుకున్నాయి.
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, తెలంగాణలోని ములుగు బార్డర్‌లో ఉన్న ఊసూరు బ్లాక్‌లో హెలికాప్టర్లు, డ్రోన్లతో వేట సాగించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్లకు అడుగడుగునా మందుపాతరలు కనిపించాయి. తొమ్మిది రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో సుమారు 200కు పైగా మందుపాతరలను నిర్వీర్యం చేశారు. ఇందులో బీర్ బాటిల్ బాంబులు సైతం ఉన్నాయి. మరో వైపు ఎంత తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొందరు జవాన్లు డీహైడ్రేషన్‌కు గురి కాగా, వారిని హాస్పిటల్స్‌కు తరలించి, వారి ప్లేస్‌లో బ్యాకప్ టీమ్స్‌ను పంపించారు. సుమారు ఐదువేల అడుగుల ఎత్తు ఉన్న కర్రె గుట్టలపైకి భద్రతాబలగాలు విడతల వారీగా చేరుకున్నాయి. ఈ క్రమంలో గుట్టల్లో భారీ బంకర్‌ను గుర్తించిన బలగాలు, ఇందులో వెయ్యి మంది ఉండేలా సౌకర్యాలు ఉన్నట్లు తేల్చారు.
కర్రెగుట్టలపై జాతీయ జెండా
కర్రెగుట్టల్లో తొమ్మిది రోజుల పాటు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయిందంటూ ప్రకటించిన బలగాలు బుధవారం జాతీయ జెండాను ఎగురవేశాయి. గుట్టల్లో బేస్ క్యాంప్‌ను సైతం ఏర్పాటు చేసేందుకు జవాన్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అబూజ్‌మఢ్ తర్వాత అతి కీలకమైన కర్రె గుట్టలను స్వాధీనం చేసుకోవడం ‘ఆపరేషన్ కగార్’లో కీలక పరిణామని చెబుతున్నారు. ఈ విషయంపై ఐబీ డైరెక్టర్ తపన్ డేకాకు చత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్, నక్సల్స్ ఆపరేషన్ డీజీ వివేకానంద సిన్హా, బస్తర్ ఐజీ ఐజీ సుందర్ రాజ్‌కు రిపోర్ట్ అందజేశారు.
తప్పించుకున్న హిడ్మా, అగ్రనేతలు
భద్రతాబలగాలు ఆపరేషన్ స్టార్ట్ చేసిన రెండో రోజే కొందరు మావోయిస్టులు కనిపించడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో పీఎల్‌జీఏ నంబర్ 1 బెటాలియన్‌కు చెందిన సింధు, హుంగీ, శాంతి అనే ముగ్గురు మహిళా మావోయిస్టులు చనిపోయారు. తర్వాత జరిగిన ఎన్ కౌంటర్ లో 30 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినట్లు వార్తలు వచ్చినా అందులో వాస్తవం లేదని తేలింది. అయితే బలగాలు హెలికాప్టర్లు, డ్రోన్ల వంటి అత్యాధునిక పరిజ్ఞానంతో కర్రెగుట్టలపైకి వస్తుండడంతో మావోయిస్ట్ అగ్రనేతలైన హిడ్మా, దేవా, ఆజాద్, దామోదర్, సుజాత వంటి వారు టీమ్స్‌గా విడిపోయి, భద్రతాబలగాల కన్నుగప్పి పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.