పుష్ప స్టైల్​లో గంజాయి స్మగ్లింగ్

పుష్ప స్టైల్​లో గంజాయి స్మగ్లింగ్
  • పుష్ప స్టైల్​లో గంజాయి స్మగ్లింగ్
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • రూ.75 లక్షల విలువైన 3 క్వింటాళ్ల సరుకు స్వాధీనం

హనుమకొండ, ఎల్కతుర్తి, వెలుగు :  పుష్ప స్టైల్​ లో గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఇద్దరు సభ్యులను వరంగల్ టాస్క్​ఫోర్స్, ఎల్కతుర్తి పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి రూ.75 లక్షల విలువైన 3 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్​సీపీ అంబర్​కిశోర్​ఝా సోమవారం అరెస్ట్ వివరాలను కమిషనరేట్​లో తెలియజేశారు. మధ్యప్రదేశ్​రాష్ట్రం కార్గావ్​జిల్లాకు చెందిన కోలి రాజావర్మ, మహారాష్ట్రలోని జల్​ గావ్​జిల్లాకు చెందిన పార్టిల్​నామ్​దేవ్​, రాహుల్ సబులే, శుభం గోతీరామ్ సబులే, శేషుకుమార్ కొంతకాలంగా గంజాయి స్మగ్లింగ్​ చేస్తున్నారు. ఇందులో భాగంగా కోలి రాజావర్మ, పార్టిల్​నామ్​దేవ్​ ఆంధ్రా-–ఒడిశా బార్డర్​లో తెలిసిన వ్యక్తి ద్వారా 300 కిలోల గంజాయి కొన్నారు. 

రెండు కిలోల ప్యాకెట్ల చొప్పున ప్యాక్​చేశారు. పోలీసులకు చిక్కొద్దనే ఉద్దేశంతో ఒక వ్యాన్ పై తాటిపత్రితో కప్పు ఏర్పాటు చేసి, దానిపై గంజాయి ప్యాకెట్లను పేర్చారు. ఆ ప్యాకెట్లపై మరో తాటిపత్రిని కప్పి, వరంగల్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. సోమవారం ఉదయం ఎల్కతుర్తి మండలం పెంచికలపేట సమీపంలో ఏర్పాటు చేసిన ఎలక్షన్​ చెక్ పోస్ట్ వద్ద టాస్క్ ఫోర్స్, ఎల్కతుర్తి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

వ్యాన్ రిజిస్ట్రేషన్ పేపర్​లోని నంబర్​, ఇంజిన్ పై ఉన్న నంబర్ వేర్వేరుగా ఉండడంతో అనుమానం వచ్చి క్షుణ్నంగా తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. రాజావర్మ, పార్టిల్​ నామ్​దేవ్​ లను అదుపులోకి తీసుకోగా, రాహుల్ సబులే, శుభం గోతీరామ్ సబులే,  శేషుకుమార్  పరారీలో ఉన్నారు. స్మగర్లను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, కాజీపేట ఏసీపీ పి.డేవిడ్ రాజ్,  సీఐలు పెండ్యాల దేవేందర్,  సంజీవ్, ఎల్కతుర్తి ఎస్సై రాజ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్సై శరత్ కుమార్, ఏఏవో సల్మాన్ పాషా లను సీపీ అంబర్​ కిశోర్​ఝా అభినందించారు.