వరంగల్ జిల్లాలో రూ. 3.81 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

వరంగల్ జిల్లాలో రూ. 3.81 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

వరంగల్​/నర్సంపేట, వెలుగు : వరంగల్‌‌‌‌ జిల్లా ఖానాపురం మండల అడవుల్లో దాచిపెట్టిన 763 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్‌‌‌‌ సీపీ సన్‌‌‌‌ప్రీత్‌‌‌‌సింగ్‌‌‌‌ మంగళవారం (సెప్టెంబర్ 03) వెల్లడించారు.  ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలానికి చెందిన భూక్య సాయికుమార్, ఏపీలోని తుర్పుగోదావరి జల్లా మారేడుమిల్లికి చెందిన అందాల పాండురెడ్డి, ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌‌‌‌గిరి జిల్లా కలిమెలకు చెందిన గుల్లారి మునిరాజ్, చిత్రకొండ మండలం పాపలూరుకు చెందిన కొప్పు కోటయ్య, గుర్రలూరుకు చెందిన రమేశ్‌‌‌‌, గిల్లమడుగుకు చెందిన మజ్జి కృష్ణ, నాయిని రమేశ్‌‌‌‌, బీదర్‌‌‌‌కు చెందిన ప్రకాశ్‌‌‌‌ ముఠాగా ఏర్పడి గంజాయి దందా చేస్తున్నారు. 

ఈ క్రమంలో గత నెల 28న ఏపీ, ఒడిశా బార్డర్‌‌‌‌లో సేకరించిన 763 కిలోల ఎండు గంజాయిని ట్రాలీ ఆటోలో నింపుకొని ఇల్లందు, కొత్తగూడ మీదుగా వరంగల్‌‌‌‌కు బయలుదేరారు. అయితే నర్సంపేట పట్టణ శివారులోని పాకాల రోడ్‌‌‌‌ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండడాన్ని గమనించి.. ఆటోను చిలుకమ్మనగర్‌‌‌‌ గుట్ట సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గంజాయిని అన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసి కవర్‌‌‌‌ కప్పి దాచిపెట్టారు. 

మునిరాజ్‌‌‌‌, కోటయ్య, మజ్జి కృష్ణతో పాటు మరో వ్యక్తి చిలుకమ్మగుట్ట వద్దకు వెళ్లి గంజాయి మూటలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌‌‌‌కు తరలించారు. మొత్తం రూ. 3.81 కోట్ల విలువైన 763 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. గంచాయి, నిందితులను పట్టుకున్న స్పెషల్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ ఏసీపీ జితేందర్‌‌‌‌రెడ్డి, డ్రగ్స్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఇన్స్‌‌‌‌పెక్టర్‌‌‌‌ సతీశ్‌‌‌‌, ఆర్‌‌‌‌ఐ శివకేశవులు, ఏఏవో సల్మాన్‌‌‌‌పాషా, ఆర్‌‌‌‌ఐలు పూర్ణచందర్, మనోజ్, నాగరాజును సీపీ అభినందించారు.