‘మార్క్’ ప్రోగ్రాంను పక్కాగా అమలు చేస్తాం : విద్యుల్లత

‘మార్క్’ ప్రోగ్రాంను పక్కాగా అమలు చేస్తాం : విద్యుల్లత
  •     7వ జోనల్​ ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా అధికారి విద్యుల్లత

మరికల్​, వెలుగు : సాంఘీక సంక్షేమ ఎస్సీ, బీసీ గురుకులాల్లో ఇంటర్​, ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే  లక్ష్యమని 7వ జోనల్,​ ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా అధికారి  విద్యుల్లత స్పష్టం చేశారు. గురువారం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల, కళాశాలలో 'మార్క్' అనే ప్రోగ్రాం పై ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని గురుకుల పాఠశాల, కళాశాలల 32 మంది ప్రిన్సిపళ్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆమే మాట్లాడారు. ఉమ్మడి పాలమూర్​ జిల్లాలోని గురుకులాల్లో ఇంటర్​, ఎస్సెస్సీ చదువుకునే విద్యార్థులు మొత్తం 6,094 మంది ఉన్నారని వీరు ఇది వరకు రాసిన ఆన్సర్​షీట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. వీరికి వచ్చిన మార్కుల ఆధారంగా వార్షిక పరీక్షల్లో అందరూ ఉత్తీర్ణులయ్యేందుకు 17 మంది నిపుణుల సూచనల ప్రకారం  ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆమె చెప్పారు. 

వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రిన్సిపళ్లు, ఉపాధ్యాయులు కృషిచేయాలని కోరారు. ఉన్నతధికారులు చెప్పిన 'మార్క్​' ప్రోగ్రాంను పక్కాగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నారాయణపేట జిల్లా డీసీవో నాగమణిమాలతో ఉమ్మడి పాలమూర్​ జిల్లా గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్​ పాల్గొన్నారు.